Begin typing your search above and press return to search.

ట్రంప్ కు భారత్ ముద్దొచ్చింది

By:  Tupaki Desk   |   27 Jan 2016 6:57 AM GMT
ట్రంప్ కు భారత్ ముద్దొచ్చింది
X
డోనాల్డ్ ట్రంప్. ఈ పేరు విన్న వెంటనే వివాదాస్పద వ్యాఖ్యలు.. సంచలన స్టేట్ మెంట్లతో పాటు.. అమెరికా అధ్యక్ష పదవికి ఇలాంటి వ్యక్తి కానీ చేపడితే పరిస్థితేమిటి? అన్న సందేహం రాక మానదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున పోటీ చేయటానికి వీలుగా ప్రచారం షురూ చేసిన డోనాల్డ్ ట్రంప్.. తొలిసారి భారత్ గురించి పెదవి విప్పారు. భారత్ గురించి ప్రస్తావించిన ట్రంప్.. తెగ పొగిడేయటం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటివరకూ మెక్సికో.. జపాన్.. చైనా సహా పలు దేశాలపై విమర్శల వర్షం కురిపించిన డొనాల్డ్ ట్రంప్.. అందుకు భిన్నంగా భారత్ ను మాత్రం పొగిడేశారు. తాజాగా మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్ భారత్ గురించి వ్యాఖ్యానిస్తూ.. ‘‘నేను భారత్ తో కలిసి పని చేయాలని అనుకుంటున్నా. నాకు ఇండియాలో ఎక్కువ పని ఉంది. భారత్ ఎంతో గొప్పగా పని చేస్తుంది. కానీ.. ఆ దేశం గురించి ఎవరూ మాట్లాడటం లేదు’’ అంటూ వ్యాఖ్యానించటం గమనార్హం.

ఇక.. ఇండియా చైనాల మధ్య వ్యత్యాసం గురించి ప్రస్తావిస్తూ.. ఇండియా.. చైనాల గురించి అందరూ మాట్లాడుతున్నారని.. చైనా పని చేస్తున్నా.. భారత్ బాగా పని చేస్తుందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అమెరికా గురించి ఎవరూ మాట్లాడుకోవటం లేదన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందరూ భారత్.. చైనా గురించి మాట్లాడుతూ.. అమెరికా గురించి ఎవరూ మాట్లాడటం లేదన్నారు. ‘‘ఇది కచ్ఛితంగా అమెరికన్లకు చెడువార్త’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. భారత సమాజాన్ని బుట్టలో వేసుకోవటానికే ట్రంప్ పొగడేసే కార్యక్రమం పెట్టుకున్నారా? లేక.. నిజంగానే భారతీయుల పట్ల ట్రంప్ మనసులో సానుకూలత ఉందా? అన్నది రానున్న రోజుల్లో తేలిపోతుంది.