Begin typing your search above and press return to search.

డేట్ ఫిక్స్.. భారత్ కు వస్తున్న ట్రంప్.. వెంట మెలానియా కూడా

By:  Tupaki Desk   |   11 Feb 2020 5:45 AM GMT
డేట్ ఫిక్స్.. భారత్ కు వస్తున్న ట్రంప్.. వెంట మెలానియా కూడా
X
అమెరికాతో భారత్ బంధం అంతకంతకూ బలపడుతోంది. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో అగ్రరాజ్యం తో మరింత సన్నిహిత సంబంధాల్ని మొయింటైన్ చేస్తోంది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన ఒబామాతో సన్నిహిత సంబంధాల్ని నెరపినట్లే.. ట్రంప్ తోనూ అంతే సన్నిహితంగా ఉంటున్నారు. ఆ మాటకు వస్తే.. ఆ మధ్యన అమెరికాలో నిర్వహించిన భారీ సభకు మోడీ హాజరు కావటమే కాదు.. తన మిత్రుడు కమ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను పిలిచి.. ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తిన వైనం తో అమెరికా అధ్యక్షుడు ఎంతలా ఫిదా అయ్యారో చెప్పాల్సిన అవసరం లేదు.

దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న మోడీ.. అమెరికా అధ్యక్షుడికి అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారం చేసినట్లు గా పలువురు వేలెత్తి చూపినా.. దేశ ప్రధాని మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. తనను ఇంత ఓపెన్ గా బలపర్చిన మోడీ విషయంలో ట్రంప్ ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శిస్తారని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడి గా ఎన్నికైన తర్వాత మొదటి సారిగా భారత్ కు రానున్నారు.

మరో ఏడాదిలో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న వేళలో ట్రంప్ భారత పర్యటన ఆసక్తికరంగా మారింది. తాజా పర్యటనకు సంబంధించిన సమాచారం కొన్ని రోజుల క్రితం బయటకు వచ్చినా.. ఏ తేదీల్లో వస్తున్నారన్న విషయంపై తాజాగా ప్రకటన చేశారు. ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్ పర్యట ఉంటుందని వెల్లడించారు. ఈ టూర్ కు ట్రంప్ తో పాటు.. అమెరికా ప్రథమ మహిళ ట్రంప్ సతీమణి మెలానియా కూడా హాజరు కానున్నారు.

గతవారం ప్రధాని మోడీ.. ట్రంప్ లు ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నారని.. ఈ సందర్భం గా అమెరికా అధ్యక్షుడి భారత్ టూర్ గురించి చర్చకొచ్చినట్లుగా చెప్పారు. తాజా పర్యటనలో పలు వాణిజ్య ఒప్పందాలు జరగటంతో పాటు.. ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య విభేదాలు సమిసిపోయే అవకాశం ఉందంటున్నారు. అయితే.. ట్రంప్ భారత పర్యటన ఎక్కడ ఉంటుందన్న దానిపైన మాత్రం క్లారిటీ రాలేదు. ఇప్పటివరకూ వచ్చిన వార్తల ప్రకారం ట్రంప్ భారత్ పర్యటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో జరుగుతుందన్న ప్రచారం జరిగింది. అయితే.. వెన్యూ మీద మాత్రం అధికారికంగా ప్రకటన రాకపోవటం గమనార్హం.