Begin typing your search above and press return to search.

ట్రంప్ ఉండేది ఇక అక్కడే..

By:  Tupaki Desk   |   20 Jan 2021 10:31 PM IST
ట్రంప్ ఉండేది ఇక అక్కడే..
X
అమెరికా నూతన అధ్యక్షుడిగా జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే.. ఇప్పటిదాకా అధ్యక్షుడిగా చేసి ఓడిన ట్రంప్ అమెరికా అధ్యక్ష భవనంను ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ట్రంప్.. తన భార్య, కుటుంబంతో కలిసి శ్వేతసౌధాన్ని విడిచి వెళ్లిపోయారు.

అధ్యక్ష హోదాలో చివరిసారిగా మెరైన్ వన్ హెలిక్యాప్టర్ ఎక్కి.. ఫ్లోరిడాలోని తన శాశ్వత నివాసానికి బయలుదేరారు. ఇప్పటికే ట్రంప్ సామగ్రిని అంతటిని ఫ్లోరిడా పామ్ బీచ్ లో ఉన్న ‘మార్ ఏ లాగు’ ఎస్టేట్ కు తరలించారు.

శీతాకాల వైట్ హౌస్ గా పిలిచే మార్ ఏ లాగు ఎస్టేట్ లో ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఎక్కువ కాలం గడిపారు. 2019 తర్వాత ట్రంప్ తన అధికార నివాసంగా కూడా మార్ ఏ లాగును మార్చారు. 20 ఎకరాల్లో విస్తరించిన ఈ ఎస్టేట్ లో ఏకంగా 128 గదులు ఉన్నాయి. 5 టెన్నిస్ కోర్టులు, 20 వేల చదరపు అడుగుల్లో ఫుట్ బాల్ రూం, వాటర్ ఫ్రంట్ రూం లాంటి అధునాతన సౌకర్యాలున్నాయి. ట్రంప్ కు ఇందులో ప్రత్యేక వసతి గదులున్నాయి. మార్కెట్ అంచనా ప్రకారం దీని విలువ సుమారు రూ.12వేల కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

వాషింగ్టన్ వీడే ముందు ట్రంప్ తన మద్దతుదారులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. నాలుగేళ్లు అద్భుతంగా గడిచాయని.. మనమంతా కలిసికట్టుగా చాలా సాధించామని.. సంక్షోభ సమయంలో అద్భుతంగా పనిచేశామన్నారు. త్వరలో కొత్త ఫోరంలో కలుద్దాం అంటూ ప్రసంగాన్ని ట్రంప్ ముగించారు.