Begin typing your search above and press return to search.

ఫౌచీపై మరోసారి నోరు పారేసుకున్న అధ్యక్షుడు ట్రంప్

By:  Tupaki Desk   |   21 Oct 2020 12:00 PM IST
ఫౌచీపై మరోసారి నోరు పారేసుకున్న అధ్యక్షుడు ట్రంప్
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లిక్ అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థులను చెడామడా తిట్టేస్తున్నారు. నోటికి ఏది వస్తే అది అనేస్తున్నారు. తాజాగా అమెరికాలో కరోనా నియంత్రణలో ట్రంప్ విఫలమయ్యాడన్న ప్రత్యర్థుల విమర్శలపై ఆయన స్పందించారు.

కరోనా వైరస్ విలయానికి కారణం తాను కాదని.. తప్పుడు సలహాలిచ్చిన సైంటిస్టులదేనని డొనాల్డ్ ట్రంప్ తిట్టిపోశారు. ప్రధానంగా వైట్ హౌస్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ గా పనిచేసిన అంటువ్యాధుల నిపుణులు, సైంటిస్ట్ అంటోని ఫౌచీపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంటోని ఫౌచీ ఓ పనికిమాలిన సైంటిస్ట్ అని ట్రంప్ నోటు పారేసుకున్నారు. ఆయనను ఇడియట్ అంటూ తిట్టిపోశారు.

ప్రచార ర్యాలీలో మాట్లాడిన ట్రంప్.. ఎన్నికల దృష్ట్యా ఫౌచీపై చర్యలు తీసుకోవడం లేదని.. అతడి సలహాలు వింటే అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 5 లక్షలకు పెరిగి ఉండేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫౌచీ తీరుతో జనం బాగా విసిగిపోయారని.. ఈ ఇడియట్ మాటలను వినడానికి ప్రజలు సిద్ధంగా లేరని ట్రంప్ అన్నారు.

కాగా ట్రంప్ కరోనా చర్యలను ఫౌచీ గతంలో ఎత్తిచూపారు. కరోనా కట్టడిలో ట్రంప్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న ప్రత్యర్థుల ప్రచారాన్ని నెపాన్ని ఇప్పుడు పౌచీపై నెట్టేసే ప్రయత్నాన్ని ట్రంప్ చేస్తున్నారని డెమొక్రటిక్ నేతలు విమర్శిస్తున్నారు.

కాగా ఫౌచీ కామెంట్లను డెమొక్రటిక్ పార్టీ హైలెట్ చేస్తూ ప్రచారం చేస్తూ ట్రంప్ ను ఇరుకునపెడుతోంది. ఈ క్రమంలోనే ట్రంప్ నోరుపారేసుకున్నారు.