Begin typing your search above and press return to search.

ట్రంప్ టైం అస్సలు బాగోలేదే..

By:  Tupaki Desk   |   9 Oct 2016 5:14 AM GMT
ట్రంప్ టైం అస్సలు బాగోలేదే..
X
ట్రంప్ కు టైం మరీ బ్యాడ్ గా నడుస్తోన్నట్లు కనిపిస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో నిలవటం.. నోరు జారి సమస్యల్ని కొని తెచ్చుకునే అలవాటున్న ట్రంప్ కు.. గతంలో చేసిన తప్పులకు తాజాగా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓపక్క పేరు ప్రఖ్యాతులే కాదు..ఆర్థికంగా ఆయనకు భారీగానే దెబ్బ పడుతున్న వైనం తాజాగా బయటకు వచ్చింది.

అమెరికా అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి తాజాగా బయటకు వచ్చింది. నిత్యం ఏదో ఒక మాట మాట్లాడి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపడతారో లేదో కానీ.. తాజాగా ఆయన ఆస్తులు మాత్రం భారీగా కరిగినట్లుగా తెలుస్తోంది.గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఆయన నికర సంపదను చూసినప్పుడు వేలాది కోట్ల రూపాయిలు తగ్గిపోవటం గమనార్హం.

ప్రముఖ పారిశ్రామికవేత్తగా సుపరిచితులైన ట్రంప్ గత ఏడాది నికర ఆస్తులు రూ.29,969 కోట్లుగా చెబుతారు. కానీ.. ఈ ఏడాది మాత్రం ఆయన ఆస్తుల నికర విలువ దాదాపు రూ.5,328 కోట్లు తగ్గి రూ.24,641 కోట్లకు పడిపోవటం గమనార్హం. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సీరియస్ గా ప్రయత్నిస్తున్న ఆయన.. భారీగా ఖర్చు చేస్తున్నారు. విరాళాల రూపంలో భారీగానే నిధులు సమకూరుతున్నా.. ఆయన ఆస్తుల విలువ పెద్ద మొత్తంలో తగ్గటం గమనార్హం.

ఫోర్బ్ జాబితాలో ఆయన ‘నెంబరు’ భారీగా పడిపోయింది. అమెరికాలో సంపన్నుల జాబితాలో ట్రంప్ 35 స్థానాలు కిందకు దిగజారిపోయారు. గత ఏడాదితో పోలిస్తే ఆయన 35 స్థానాలు కిందకు పడిపోయి 156 ర్యాంకుకు పరిమితం కావాల్సిన పరిస్థితి. అమెరికాలోని అత్యంత సంపన్నులైన టాప్ 400 మందిలో ట్రంప్ గత ఏడాది 121వ స్థానంలో ఉండేవారు. ఏడాది వ్యవధిలో ఆయన ర్యాంక్ భారీగా తగ్గిపోయింది. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అమెరికా అధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలు రోజురోజుకీ తగ్గుతుంటే.. మరోవైపు ఆయన నికర సంపద తగ్గిపోవటం చూస్తే.. ట్రంప్ టైం ఏ మాత్రం బాగున్నట్లుగా కనిపించట్లేదని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/