Begin typing your search above and press return to search.

ట్రంప్‌ కు కిమ్ మూముల షాకివ్వ‌లేదుగా

By:  Tupaki Desk   |   16 Oct 2017 7:06 AM GMT
ట్రంప్‌ కు కిమ్ మూముల షాకివ్వ‌లేదుగా
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విష‌యంలో ఉత్త‌ర‌కొరియా ర‌థ‌సార‌థి కిమ్ చెల‌రేగిపోతున్నారు. ఇప్ప‌టికే రెచ్చ‌గొట్టే ప్ర‌క‌ట‌న‌లు..క‌ల‌క‌లం రేపే రీతిలో అణ్వ‌స్త్ర ప‌రీక్ష‌లు చేస్తూ ట్రంప్‌కు బీపీ పెంచేసిన కిమ్ తాజాగా మ‌రో షాకింగ్ చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. అయితే ఇది నేరుగా కిమ్ చేయ‌క‌పోయినా...ఆ దేశ పౌరులు చేయ‌డం...మీడియాలో ర‌చ్చ‌రచ్చ కావ‌డంతో కిమ్ దీని వెనుక ఉన్నార‌ని భావిస్తున్నారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే....అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను తలకిందులుగా వేలాడదీస్తున్నట్లు ఫొటో విడుద‌ల చేయ‌డం.

ఈ ఫొటోలో దీంతో పాటుగా మ‌రికొన్ని రెచ్చ‌గొట్టే అంశాలు కూడా ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ నోటి నుంచి రక్తం కారుతున్నట్టుగా ఫోటోలో కనిపిస్తుండ‌ట‌మే కాకుండా... ``పిచ్చిపట్టిన ముసలివాడు డొనాల్డ్ ట్రంప్‌ కు మరణాన్ని అందించాల్సి ఉంది`` అని ఫోటోపై ప్రింట్ చేసి ఉండ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఈ మార్ఫింగ్‌ ఫొటో ఇటు ఉత్త‌ర‌కొరియా మీడియాలోనూ అటు అంత‌ర్జాతీయ మీడియాలోనూ వైర‌ల్ అయింది. అయితే దీనిపై ఉత్త‌ర‌కొరియా అధికారికంగా స్పందించ‌లేదు. త‌మ ప‌నే అని స్వాగ‌తించ‌లేదు...ఇది స‌రికాద‌ని కొట్టిపారేయ‌లేదు కూడా!

కాగా, ఉత్తర కొరియాతో నెలకొన్న వివాదంపై అమెరికా వేస్తున్న అడుగులు, చేస్తున్న ఏర్పాట్లు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయని అంటున్నారు.. యుద్ధ నౌకల్ని(రొనాల్డ్‌ రీగన్‌), అణు జలాంతర్గాముల్ని (మిచిగాన్‌) కొరియా ద్వీపకల్పంలో మోహరిస్తోంది. వీటిని ఇక్కడికి చేర్చాక, ద.కొరియా, జపాన్‌లతో కలిసి అమెరికా సైన్యం సంయుక్త విన్యాసాల్ని నిర్వహించనున్నది. దక్షిణ చైనా సముద్ర జలాల్లో ఉన్న 'రొనాల్డ్‌ రీగన్‌' యుద్ధనౌక కూడా కొరియా ద్వీపకల్పం దిశగా వ‌స్తోంది. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 20 కల్లా జరిగే సంయుక్త సైనిక విన్యాసాల్లో ఇది పాల్గొనాల్సి ఉంది. ఉత్త‌ర‌.కొరియా ఒకవేళ బాలిస్టిక్‌ క్షిపణి దాడి చేస్తే, దానిని అడ్డుకోవటం ఎలా ? జలాంతర్గాములు, యుద్ధనౌకలతో సైనిక ఆపరేషన్లను ఎలా నిర్వహించాలి ? అన్నదాని గురించి రిహార్సల్స్‌ మొదులు పెట్టినట్టు రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసమే తాజాగా, అణు క్షిపణి దాడులు చేయగల 'యుఎస్‌ఎస్‌ మిచిగాన్‌' జలాంతర్గామి దక్షిణ కొరియా నౌకాకేంద్రం బుసాన్‌కు చేరుకుందని స‌మాచారం. అత్యంత పెద్దదైన, శక్తివంతమైన మిచిగాన్‌ జలాంతర్గామిని దక్షిణ‌కొరియా తీరానికి అమెరికా చేర్చిందంటే దాని అర్థం, ఉత్తర కొరియాపై ఎప్పుడైనా, ఏ క్షణమైనా దాడులు చేస్తామని బెదిరించటమేన‌ని చెప్తున్నారు.