Begin typing your search above and press return to search.

ట్రంప్ పదవికి ఎసరు?

By:  Tupaki Desk   |   17 May 2017 6:33 AM GMT
ట్రంప్ పదవికి ఎసరు?
X
అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలకు దిగబోతున్నారా...? ఆయన కుర్చీ కింద మంట మొదలైందా...? స్వయం కృతాపరాధాలతో ట్రంప్ తన గోతిని తానే తవ్వుకుంటున్నారా... ఆయన్ను అభిశంసించే అవకాశం ఉందా? అంటే అవుననే అంటున్నాయి అమెరికా మీడియా వర్గాలు. ప్రస్తుతం అమెరికాలో చోటుచేసుకున్న పరిణామాలు ట్రంప్ కు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. అమెరికన్‌ మీడియా ట్రంప్ ను ఏకిపారేస్తోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడుతున్నాయి.

రష్యా రాయబారితో రహస్య సమాచారం పంచుకున్నారని వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన పై ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అంతే కాకుండా...ఎఫ్బీఐ డైరెక్టర్ ను తొలగించే ముందు చోటుచేసుకున్న సంఘటన ఒకటి అమెరికాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే... తాజాగా మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్‌ ఫ్లైన్‌ పై విచారణను నిలిపివేయాలని ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ కామీని ట్రంప్‌ కోరారట. ఇందుకు సంబంధించి ట్రంప్, మైకేల్ ఫ్లెన్ మధ్య జరిగిన సంభాషణల వివరాలు కామీ వద్ద ఉన్నాయని, ఆ సంభాషణలపై కామీ రాసుకున్న నోట్స్ ను తాము పూర్తిగా చదివామని న్యూయార్క్‌ టైమ్స్‌ సంచలన వార్తను ప్రచురించింది. ఆ నోట్స్ ను ఓ సోర్స్‌ ద్వారా సంపాదించి చదివామని, అందులో ఫిబ్రవరి 14న జరిగిన ఓ సమావేశంలో కామీని కలుసుకున్న ట్రంప్‌.. 'ఫ్లైన్‌ మంచివాడు, అతనిని వదిలేస్తావని ఆశిస్తున్నా' అంటూ సూచించారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అంతకు ముందు ట్రంప్ రష్యా రాయబారికి రహస్యాలు చెప్పాడంటూ వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. దీంతో అమెరికాలో ట్రంప్ కు వ్యతిరేకంగా ఆందోళనలు మళ్లీ ఊపందుకున్నాయి.

ఈ నేపథ్యంలో ట్రంప్ ను అభిశంసన తీర్మానం ద్వారా తొలగించే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. మరోవైపు వైట్ హౌస్ మాత్రం ఈ పరిస్థితులను నివారించడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. ట్రంప్ పై అసత్య ప్రచారం తగదని మీడియా సంస్థలకు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. మీడియాలో వస్తున్న విధంగా అధ్యక్షుడు ట్రంప్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జనరల్‌ ఫ్లైన్‌ పై విచారణను నిలిపేయాలని ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ లేదా మరే ఇతర వ్యక్తిని కోరలేదని స్పష్టం చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/