Begin typing your search above and press return to search.

ట్రంప్ జోరుకు సొంత పార్టీ బ్రేకులు

By:  Tupaki Desk   |   22 March 2016 4:33 AM GMT
ట్రంప్ జోరుకు సొంత పార్టీ బ్రేకులు
X
వివాదాస్పద వ్యాఖ్యలతో అమెరికా సమాజాన్నే కాదు.. ప్రపంచ దేశాల్ని ఉలిక్కిపడేలా చేస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత డోనాల్డ్ ట్రంప్ జోరుకు బ్రేకులు వేసే ప్రక్రియ మొదలైంది. ఎంత చెప్పినా వినకుండా మొండిగా వ్యవహరించటమే కాదు.. నాలుకకు అడ్డే లేనట్లుగా మాటలకు చెక్ చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నట్లుగా రిపబ్లికన్ పార్టీ నేతలు భావిస్తున్నట్లు ఆ పార్టీ తీసుకున్న తాజా నిర్ణయం చెప్పకనే చెప్పేస్తుంది.

పార్టీకి చెందిన 2,472 మంది ప్రతినిధుల్లో 1237 మంది మద్దతు పొందితేనే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను రిపబ్లికన్ల తరఫున అభ్యర్థిగా బరిలోకి దించుతామన్న విషయాన్ని తాజాగా సూటిగా చెప్పేసింది. రిపబ్లికన్ నేషనల్ కమిటీ ఛైర్మన్ రెయిన్స్ ఫ్రీబస్ తాజాగా మాట్లాడుతూ.. పార్టీకి చెందిన ప్రతినిధుల మెజార్టీ.. అభ్యర్థి ఎంపికలో తప్పనిసరి అన్న మాటను స్పష్టం చేశారు.

అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున బరిలోకి దిగిన అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ మద్దుతు పొందితే వారికే అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేయాలన్న ట్రంప్ వాదనను తోసిపుచ్చుతూ.. పార్టీ ప్రతినిధుల్లో 51 శాతం మద్దతు తప్పనిసరి అని తేల్చారు. ఒకవేళ 51 శాతం మెజార్టీని సాధించకుంటే.. పార్టీనే అభ్యర్థిని ఎంపిక చేస్తుందన్న విషయాన్ని స్పష్టం చేయటం గమనార్హం. ఇప్పటివరకూ 19 రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ 678 మంది ప్రతినిధుల మద్దతు పొంది అధిక్యంలో ఉన్నప్పటికి అంతిమ లక్ష్యమైన 1237 మంది మద్దుతకు చాలా దూరంలోనే ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు.

రానున్న రోజుల్లో జరగనున్న 19 రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ తాను సాధించాల్సిన సభ్యుల మద్దుతు పొందటం అంత తేలికైన వ్యవహారం కాదు. తన మాటలతో మంట పుట్టిస్తున్న ట్రంప్ ను అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిగా బరిలోకి దించేందుకు రిపబ్లికన్లు ఏ మాత్రం సిద్ధంగా లేరు. అందుకే.. ప్రతినిధుల ఓట్లలో 51 శాతం పొందటం తప్పనిసరన్న మాటను తేల్చి చెప్పటం ద్వారా ట్రంప్ జోరుకు బ్రేకులు వేయాలన్నది ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి.. తనకు వ్యతిరేకంగా జట్టు కడుతున్న పార్టీ నేతల వైఖరిపై ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.