Begin typing your search above and press return to search.

‘‘యాపిల్’’ మీద ట్రంప్ వార్

By:  Tupaki Desk   |   20 Feb 2016 5:59 AM GMT
‘‘యాపిల్’’ మీద ట్రంప్ వార్
X
అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న రిపబ్లికన్ల అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థుల జాబితాలో తాజాగా మరో పేరు చేరిపోయింది. ఎలాంటి విషయం మీదనైనా ఆచితూచి స్పందించే తీరు ఏ మాత్రం లేని ట్రంప్ ప్రముఖ దిగ్గజ కంపనీ మీద యుద్ధానికి దిగారు. ఒక హంతకుడి ఫోన్ ను అన్ లాక్ చేసేందుకు నిరాకరిస్తున్న యాపిల్ సంస్థపై నిప్పులు చెరిగారు. ఏకంగా యాపిల్ కంపెనీని అమెరికన్లు బాయ్ కాట్ చేయాలంటూ పిలుపునివ్వటం సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్న ఆయన నోటి నుంచి సంచలన వ్యాఖ్యలు కొత్తకావు. కానీ.. ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ విషయంలో వెనుకాముందు చూసుకోకుండా ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయటం కలకలం రేపుతోంది.

గత ఏడాది అమెరికాలో జరిగిన దాడి (కాలిఫోర్నియాలోని ఒక స్కూల్లో పిల్లలపై ఒక ముస్లిం జంట విచక్షణారహితంగా కాల్పులు జరిగాయి. వారు ఉగ్రవాదులుగా తేలింది) ఉదంతంలో.. దుండగులకు చెందిన యాపిల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ఫోన్లు లాక్ అయి ఉన్నాయి. వాటిని అన్ లాక్ చేయాలంటూ పోలీసులు సదరు కంపెనీని కోరటం.. దానికి యాపిల్ నిరాకరిస్తోంది.

దుండగుల ఫోన్లో నిక్షిప్తమైన సమాచారం దేశ రక్షణ అవసరాలకు అతి కీలకంగా చెబుతుంటే.. తమ వినియోగదారుల భద్రత విషయంలో తమకు రాజీ లేదని.. తాము అన్ లాక్ చేసే అవకాశమే లేదని యాపిల్ చీఫ్ టిమ్ కుక్ తేల్చి చెబుతున్నారు. దీంతో.. ఈ వివాదం రోజురోజుకీ ముదురుతోంది. తాజాగా డోనాల్డ్ ట్రంప్ సీన్లోకి వచ్చి.. యాపిల్ సంస్థ వైఖరిని ప్రశ్నించటమే కాదు.. అమెరికా భద్రత పట్ల యాపిల్ ఉదాసీనంగా ఉంటోందని.. ఆ సంస్థ బాధ్యతారాహిత్యాన్ని అమెరికన్లు తిప్పి కొట్టాలని.. యాపిల్ సంస్థను బాయ్ కాట్ చేయాలంటూ పిలుపునివ్వటం హాట్ టాపిక్ గా మారింది.