Begin typing your search above and press return to search.

అమెరిక‌న్ల‌కు ట్రంప్ కంటే ఆమె న‌చ్చింద‌ట‌

By:  Tupaki Desk   |   7 July 2017 7:22 AM GMT
అమెరిక‌న్ల‌కు ట్రంప్ కంటే ఆమె న‌చ్చింద‌ట‌
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు ఆ దేశ ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ద‌క్కుతున్న‌ట్లుగా క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల చేసిన ఓ స‌ర్వేలో ట్రంప్‌ కు మ‌ద్ద‌తిస్తున్న వారి సంఖ్య త‌క్కువ‌గా ఉన్న‌ట్లు తేలింది. తాజాగా మ‌రో స‌ర్వేలో ఇంకో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అభిప్రాయాన్ని అమెరిక‌న్లు వెల్ల‌డించారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కన్నా జర్మనీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ నే మెజారిటీ అమెరికన్లు ఎక్కువగా విశ్వసిస్తున్నారు.

ఏంజెలా మెర్కెల్‌ పనితీరుపై ఇటీవల ట్రంప్‌ విమర్శలు చేసినప్పటికీ అమెరికన్లకు మాత్రం ఆమె పైనే నమ్మకం ఉందని ఇటీవల చేసిన కొత్త సర్వేలో వెల్లడైంది. బుధవారం విడుదలైన ఈ సర్వే ఫలితాల ప్రకారం, 46 శాతం మంది అమెరికన్లకు ట్రంప్‌ పై నమ్మకముంద‌ని, 64 శాతం మంది డెమోక్రాట్లు ట్రంప్‌ కన్నా మెర్కెల్‌నే విశ్వసిస్తుండగా 89 శాతం మంది రిపబ్లికన్లు ట్రంప్‌ పై నమ్మకముంచారని సర్వే తెలిపింది. హాంబర్గ్‌ సదస్సు కన్నా ముందుగా గురువారం ట్రంప్‌ - మెర్కెల్‌ భేటీ నేపథ్యంలో ఈ సర్వే వెలువడింది. ఇరువురు నేతల మధ్య అనేక అంశాలపై విభేదాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఇమ్మిగ్రేషన్‌ అంశంపై ట్రంప్‌ తన ఎన్నికల ప్రచారంలోనూ, అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మెర్కెల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. శరణార్థులకు ద్వారాలు తెరిచి మెర్కెల్‌ భయంకరమైన తప్పు చేశారని వ్యాఖ్యానించారు. అలాగే ముస్లిం దేశాలపై ట్రంప్‌ నిషేధాజ్ఞలు విధించినపుడు మెర్కెల్‌ కూడా అదే రీతిలో స్పందించారు. పారిస్‌ వాతావరణ ఒప్పందం నుండి బయటకు వచ్చిన తర్వాత ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించిన వారిలో మెర్కెల్‌ ఒకరు.