Begin typing your search above and press return to search.

చైనా కుటిల బుద్ధికి మ‌నోళ్లు చెక్ పెట్టారు

By:  Tupaki Desk   |   14 July 2017 12:26 PM IST
చైనా కుటిల బుద్ధికి మ‌నోళ్లు చెక్ పెట్టారు
X
ప‌క్క‌నే ఉండి ప‌క్క‌లో బ‌ల్లెంలాగా మారిన చైనా ఇటీవ‌లి కాలంలో ప్ర‌ద‌ర్శిస్తున్న అత్యుత్సాహానికి మ‌న‌దేశం బ్రేకులు వేసింది. కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకునేందుకు పాకిస్తాన్‌ తో మాత్రమే చర్చలు జరుపుతామని, మూడో దేశం మధ్యవర్తిత్వానికి అంగీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం కరాఖండీగా ప్రకటించింది. కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ చైనా ఇటీవల ప్రకటించటం తెలిసిందే. భారత్ - పాకిస్తాన్ వివాదంతలో తలదూర్చటంతోపాటు మన దేశాన్ని రెచ్చగొట్టేందుకే చైనా ఈ మధ్యవర్తిత్వం ప్రతిపాదన చేసింది. సిక్కిం సెక్టార్‌ లోని డోక్లామ్‌ లో భారత - చైనా సైన్యాల మధ్య తలెత్తిన వివాదం నాలుగు వారాల నుండి కొనసాగటం తెలిసిందే. డోక్లామ్‌ నుండి భారత సైన్యాన్ని వెనక్కి పంపించేలా చేసేందుకు చైనా పలు ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం చేస్తామంటూ భారత దేశాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది.

ఇలా అనేక ఎత్తుగ‌డ‌ల‌తో మధ్యవర్తిత్వం ప్ర‌తిపాద‌న ముందుకు తెచ్చిన నేప‌థ్యంలో కేంద్ర‌ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇచ్చారు. చైనా మ‌ధ్య‌వ‌ర్తిత్వం తమకు ఎంత మాత్రం అవసరం లేదని విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయ‌న‌ స్పష్టం చేశారు. ‘కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌ తో మాత్రమే మాట్లాడుతాం. ఇతర దేశాల మధ్యవర్తిత్వం మాకు సమ్మతం కాదు. ఈ అంశంపై మాకు పూర్తి స్పష్టత ఉంది’ అని ఆయన చెప్పారు. పాక్‌నుంచి కొనసాగుతున్న సీమాంతర ఉగ్రవాదం కాశ్మీర్ సమస్యకు మూల కేంద్రం - పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం మూలంగానే దేశంతోపాటు ఈ ప్రాంతం - ప్రపంచంలో శాంతిభద్రతలకు ప్రమాదం ఏర్పడుతోందని గోపాల్ బాగ్లే స్పష్టం చేశారు. సిక్కిం సెక్టార్‌ లో భారత- చైనా సైనికుల మధ్య నెలకొన్న వివాదాన్ని దౌత్యవర్గాల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన మరోసారి వివరించారు.

మ‌రోవైపు కేంద్ర హోం మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ - విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ శుక్రవారం సిక్కిం సెక్టార్‌ లో భారత్ - చైనాల సైనికుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతపై ప్రతిపక్ష పార్టీలకు పరిస్థితులను వివరించనున్నారు. ఉగ్రవాదుల దాడిలో ఏడుగురు అమర్‌ నాథ్ యాత్రికులు మరణించేందుకు దారి తీసిన పరిస్థితులను రాజ్‌ నాథ్ సింగ్ ప్రతిపక్షానికి వివరిస్తారు. సిక్కిం సెక్టార్‌ లో భారత్ - చైనా సైనికుల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను వివరించటంతోపాటు ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకే హోం - విదేశీ వ్యవహారాల మంత్రులు శుక్రవారం ప్రతిపక్ష నాయకులను కలుసుకుంటున్నారు. సిక్కిం సెక్టార్ గొడవ ముదిరి పరిస్థితి యుద్ధానికి దారి తీసే పక్షంలో అన్నిపక్షాల మద్దతు తమకు ఉండేలా చూసుకోవటమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని స‌మాచారం.