Begin typing your search above and press return to search.

కేసీఆర్ నోట కఠినం అన్న మాటతో ఇంతలా జరుగుతుందా?

By:  Tupaki Desk   |   23 May 2021 6:30 AM GMT
కేసీఆర్ నోట కఠినం అన్న మాటతో ఇంతలా జరుగుతుందా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన ఒక్క మాట ప్రభావం ఎంతన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు చేతల్లో చేసి చూపించారు. వరంగల్ పర్యటనలో భాగంగా నిర్వహించిన రివ్యూలో రాష్ట్ర డీజీపీతో పాటు కలెక్టర్లు.. పోలీసులు అధికారులతో సమీక్ష జరిపిన ఆయన.. లాక్ డౌన్ ను ‘కఠినం’గా అమలు చేయాలని ఆదేశించారు. వైరస్ వ్యాప్తి కేసుల తగ్గించటంలో లాక్ డౌన్ కీలకమన్న విషయాన్ని గుర్తించిన సీఎం..తాజాగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు శనివారం.. తామేమిటన్నది చూపించారు.

లాక్ డౌన్ వేళలో బాధ్యత లేకుండా బయటకు వచ్చే వారికి చుక్కలు చూపించారు. అయితే.. కొన్ని చోట్ల పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం కొత్త సమస్యలకు కారణమైంది. బాధ్యత లేకుండా రోడ్డు మీదకు వచ్చే వారి విషయంలో చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. వైద్యులు.. అత్యవసర సేవలు అందించే వారిపైనా ‘రెచ్చిపోయిన’ వైనం విమర్శలకు తావిచ్చింది. మొత్తంగా చూస్తే.. లాక్ డౌన్ అమలు విషయంలో పోలీసులు ఆ మాత్రం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇలాంటి సందర్భాల్లో సంయమనం అవసరమని.. అనవసర వివాదాల జోలికి పోకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గుర్తించాలి.

తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల తీరు చూస్తే.. వరంగల్.. నల్గొండ.. హైదరాబాద్ మహానగరంలో మినహా మిగిలిన జిల్లాల్లో పెద్దగా ఫిర్యాదులు రాలేదు. ఈ మూడు చోట్ల మాత్రం పోలీసులు అవసరానికి మించి చెలరేగిపోయారన్న విమర్శ పలువురి నోట వినిపించింది. హైదరాబాద్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు అనుమతిస్తున్న పుడ్.. ఈ కామర్స్ డెలివరీ బాయస్ మీద పోలీసులు లాఠీలు ఝుళిపించటంపై విమర్శలు వెల్లువెత్తాయి. వారికి.. అనుమతి లేదని ముందుగానే ప్రకటన చేసి ఉంటే.. వారెవరూ రోడ్ల మీదకు వచ్చే వారు కాదన్న మాట వినిపిస్తోంది.

ఇదే విషయంపై మంత్రి కేటీఆర్ ట్విటర్ ఖాతాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినట్లుగా చెబుతున్నారు. తమకు డెలివరీ బాయస్ గురించి పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదులు అందాయని.. డీజీపీతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు. డెలివరీ బాయ్ ను నిలువరించటం.. వారిని లాఠీలతో కొట్టటం.. కొందరి వాహనాల్ని లాక్కున్న ఉదంతాలు రిపోర్టు అయ్యాయి. రాష్ట్ర డీజీపీ స్వయంగా హైదరాబాద్ లోని పలు రోడ్ల మీదకు వచ్చి.. లాక్ డౌన్ అమలవుతున్న తీరును స్వయంగా పర్యవేక్షించటంతోపాటు.. పలు వాహనదారులకు లాక్ డౌన్ వేళలో బయటకు రావటం ఏ మాత్రం సరికాదని చెప్పారు. ఏమైనా.. సీఎం కేసీఆర్ నోటి నుంచి ‘కఠినం’గా లాక్ డౌన్ అమలు చేయమన్న మాటకు పోలీసులు స్పందించిన తీరు అండర్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంయమనంతో కఠినంగా వ్యవహరిస్తే.. ఇప్పుడొచ్చిన విమర్శల స్థానే.. ప్రశంసలు అందేవన్న అబిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.