Begin typing your search above and press return to search.

ప్రభుత్వ వాదనను సుప్రింకోర్టు సమర్ధిస్తోందా ?

By:  Tupaki Desk   |   24 Nov 2020 10:15 AM IST
ప్రభుత్వ వాదనను సుప్రింకోర్టు సమర్ధిస్తోందా ?
X
కరోనా వైరస్ విషయంలో సుప్రింకోర్టు వ్యక్తం చేసిన ఆందోళన రాష్ట్రప్రభుత్వ వాదనని బలపరిచేట్లుగా ఉంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయని వాటిని అదుపు చేయటానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలంటూ సూటిగా ప్రశ్నించింది. దేశంలో మళ్ళీ పెరిగిపోతున్న కేసుల విషయంలో సుప్రింకోర్టు చాలా ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తుండటంపై సుప్రింకోర్టు ప్రస్తావించింది. వైరస్ మహమ్మారిని కట్టడి చేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. కట్టడికి తీసుకున్న చర్యలను ఓ నివేదిక రూపంలో తమకు అందించాలని ఆదేశించటం గమనార్హం.

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించలేమంటూ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. ఇదే సమయంలో ఫిబ్రవరిలో స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించాల్సిందే అంటూ స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గట్టిగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వహణపై ఇటు ప్రభుత్వానికి అటు నిమ్మగడ్డ పెద్ద ఎత్తున లేఖల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చీఫ్ సెక్రటరి నీలం సాహ్నీకి నిమ్మగడ్డ ఇప్పటికి మూడు లేఖలు రాశారు.

ఇదే విషయంలో ఎన్నికలు నిర్వహించే పరిస్ధితులు లేవని చీఫ్ సెక్రటరీ కూడా నిమ్మగడ్డకు సమాధానం చెప్పేశారు. అయినా తాను అనుకున్నట్లుగా ఎన్నికలు నిర్వహించాల్సిందే అన్నట్లుగా నిమ్మగడ్డ పట్టుదలతో ఉన్నారు. ఇటువంటి నేపధ్యంలోనే దేశంలో పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసుల విషయంపై స్వయంగా సుప్రికోర్టే ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం. కరోనా వైరస్ నేపధ్యంలోనే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మరికొన్ని రాష్ట్రాల్లో వాయిదా పడిన విషయం తెలిసిందే. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలోని స్ధానిక పరిస్ధితుల కారణంగా అక్కడి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్న విషయం అర్ధమవుతోంది.

ఇక ఏపి విషయానికి వస్తే అసలు కేసులే లేనపుడేమో కోరానా వైరస్ ను బూచిగా చూపించి మొన్నటి మార్చిలో నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారు. అదికూడా ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఏకపక్షంగా వాయిదా వేశారు. అప్పటి నుండి ప్రభుత్వం, ఎన్నికల కమీషన్ మధ్య ఓ రకంగా యుద్ధమే నడుస్తోంది. ఇటువంటి సమయంలోనే ఎన్నికలను నిర్వహించలేకపోతున్నామన్న ప్రభుత్వ వాదనకు సుప్రింకోర్టు ఆందోళన మద్దతుగా నిలుస్తున్నట్లు అర్ధమవుతోంది. మరి తాజా వివాదం కోర్టుకెక్కితే ఎటువంటి తీర్పు వస్తుందో చూడాల్సిందే.