Begin typing your search above and press return to search.

సారు సీన్లోకి రావాలంటే హైకోర్టు ఫుల్ సీరియస్ కావాల్సిందేనా?

By:  Tupaki Desk   |   19 Oct 2019 6:52 AM GMT
సారు సీన్లోకి రావాలంటే హైకోర్టు ఫుల్ సీరియస్ కావాల్సిందేనా?
X
పదిహేనో రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉదంతంలో హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. సమ్మెను విరమించేలా కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పటమేకాదు.. శనివారం ఉదయం పదిన్నర గంటలకల్లా కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించాలని సూచన చేయటం తెలిసిందే.

తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలని మహా మొండిగా వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తనకు ఇష్టం లేని పనిని చేయటానికి ససేమిరా అంటారు. ఒకవేళ చేయాల్సి వస్తే.. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పించి.. ఏ చిన్న అవకాశం వచ్చినా చేయటానికి ఇష్టపడరు. ఈ తీరును తాజాగా మరోసారి ప్రదర్శించారని చెప్పాలి. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టింది.

అయితే.. అలాంటి వాటిని లైట్ తీసుకునేటట్లు వ్యవహరించే సర్కారు.. హైకోర్టు ధర్మాసనం చేసిన సూచన సీరియస్ కాకపోవటంతో ఆ విషయాన్ని తర్వాత చూద్దామని వదిలేయటం ఆసక్తికరంగా మారింది. కోర్టు శనివారం నుంచి చర్చలు చేపట్టాలన్న సూచన చేసిందే తప్పించి.. పక్కాగా చర్చలు జరపాలన్న ఆదేశాలు జారీ చేయని నేపథ్యంలో.. అలాంటివి వచ్చేవరకూ వెయిట్ చేద్దామన్న ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు చెబుతున్నారు.

సంప్రదింపులతో సమ్మెను విరమించేలా చేయాలని ధర్మాసనం కోరింది కాబట్టి.. దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్న మాటను అధికారులతో అన్నట్లుగా చెబుతున్నారు. కోర్టు గట్టిగా చెబితే.. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఓకే కానీ.. ఇప్పుడు అభ్యర్థన రూపంలో చెప్పింది కాబట్టి.. కాస్త వెయిట్ చేయాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. చూస్తుంటే.. హైకోర్టు సీరియస్ అయితే కానీ సారు సీన్లోకి రావాలనుకోవటం లేదా? అన్నది ప్రశ్నగా మారింది.

ఇలా కుదిరినన్ని అడ్వాంటేజీలు తీసుకుంటే.. తర్వాతి కాలంలో తిప్పలు తప్పవంటున్నారు. ఓపక్క కార్మికులకు కోపాగ్నితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేసీఆర్ సర్కారు.. చేజేతులారా కోర్టుకు కోపం వచ్చేలా చేస్తూ తప్పు చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. తప్పు మీద తప్పులు చేస్తున్న సర్కారుకు తిప్పలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోరి తలనొప్పులు తెచ్చుకోవటం అంటే ఇదేనేమో?