Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కుపై కేంద్రం వెనక్కు పోతుందా ?

By:  Tupaki Desk   |   14 Feb 2021 7:00 AM IST
విశాఖ ఉక్కుపై కేంద్రం వెనక్కు పోతుందా ?
X
క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందుకు ఛాన్సు లేదనే అనుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వరంగ సంస్ధల్లో ప్రభుత్వ వాటాలను ఉపసంహరించుకోవటం, లేదా పెట్టుబడులను తీసేసుకుని ప్రైవేటీకరించేయలని కేంద్రం గట్టిగానే నిర్ణయించుకున్నది. ఇదేమీ కుదరకపోతే ఏకంగా వాటిని మూసేయాలని పెట్టుబడుల ప్రోత్సాహక కమిటి ఇప్పటికే కేంద్రానికి తన నివేదికను ఇచ్చేసింది. పై పనులు చేయటానికి డిసైడ్ అయిన కేంద్రం కూడా తన నిర్ణయాలకు ఫైనాన్స్ కమీషన్ నివేదికలని, పెట్టుబడుల ప్రోత్సాహక కమిటి రిపోర్టులనే ముసుగును తొడిగేస్తోంది.

నిజానికి నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్రమోడిదే అయినా దాన్ని ఓ పద్దతిలో నరుక్కొస్తోందంతే. ఇప్పటికే బోలెడన్ని కంపెనీల్లో కేంద్రం తన పెట్టుబడులను వాపసు తీసేసుకుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలోగా పై పద్దతుల్లో సుమారుగా రూ. 1.75 లక్షల కోట్ల ఆదాయాన్ని సమీకరించాలని టార్గెట్ గా పెట్టుకున్నాక కేంద్రం వెనక్కు తగ్గుతుందా ? అన్నదే సందేహం. ఇపుడు విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ విషయంలో జరిగింది, జరగబోయేది కూడా దాదాపు ఇదే.

కాకపోతే విశాఖ ఉక్కు విషయంలో ఓ వెసులుబాటుంది. అదేమిటంటే ఈ ఫ్యాక్టరీ ఆర్ధికపరిస్ధితి ఘోరంగా ఏమీలేదు. అప్పుడప్పుడు నష్టాల్లోను ఎక్కువసార్లు లాభాల్లోను నడుస్తోంది. కాబట్టి ఈ ఫ్యాక్టరీకి సొంతంగా ఇనుపగనులు లేకపోవటమే ప్రధానమైన లోపం. గనులను గనుక కేటాయిస్తే తొందరలోనే లాభాల బాట పట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నా తప్పులేదు. అయితే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటే మార్గమేమిటి ?

ఏమిటంటే రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైన నడవాలి. అవసరమైతే రాజీనామాలు చేస్తామని చెప్పటం కాదు. వెంటనే విశాఖ జిల్లాలోని ప్రజాప్రతినిధులంతా రాజీనామాలను చేయాలి. రాజీనామాలు చేయటమే కాకుండా కేంద్రంపై విపరీతమైన ఒత్తిడి తెచ్చేట్లుగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఇందుకు జగన్మోహన్ రెడ్డి ముందుండి ఉద్యమాన్ని నడిపించాలి. అప్పుడే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు అవకాశం ఉంది. లేకపోతే ఎన్నో ఉద్యమాల ఫలితంగా, ఎందరి ప్రాణత్యాగాల ఫలితంగానో సాధించుకున్న విశాఖ ఉక్కును కోల్పోవాల్సిందే.