Begin typing your search above and press return to search.

తెలంగాణలో బీజేపీ.. మోడీ కలలకు ఎంత దూరం?

By:  Tupaki Desk   |   14 Dec 2019 10:40 AM IST
తెలంగాణలో బీజేపీ.. మోడీ కలలకు ఎంత దూరం?
X
తాటిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడొస్తాడంటారు.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.. ప్రధాని నరేంద్రమోడీ తాజాగా తనను కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలతో ‘వచ్చేసారి తెలంగాణలో మనదే అధికారం’ అని భరోసా ఇచ్చారు. ఆశ పడడంలో తప్పు లేదు. కానీ బీజేపీకి తెలంగాణలో అంతటి స్థాయి.. క్షేత్రస్థాయి బలం..నడిపించే నేత ఉన్నాడా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి.

ప్రత్యర్థి బలంగా లేనప్పుడు నరేంద్రమోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటే 100 రెట్లు మోడీ బెటర్ అని జనాలు అధికారమిచ్చారు. దేశానికి మోడీ అవసరం..ఎందుకంటే అక్కడ ప్రత్యర్థి బలహీనుడు కాబట్టి. కానీ రాష్ట్రాలకు మోడీ అవసరం లేదు. మోడీని చూసి రాష్ట్రాల్లో గెలిపించలేదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ లో బీజేపీ ఓడిపోయింది. తాజాగా మహారాష్ట్రలో మట్టి కరిచింది. హర్యానాలో పొత్తుతో గట్టెక్కింది. దేశంలో 2014 తర్వాత 70 శాతం వరకూ విస్తరించిన బీజేపీ ఇప్పుడు 30శాతం రాష్ట్రాలకే పరిమితమైపోయింది.

ప్రత్యర్థి బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే మోడీషాల మ్యాజిక్ పనిచేసింది. తెలంగాణలో బీజేపీ ప్రత్యర్థి కాకలు తీరిన కేసీఆర్. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ దెబ్బతీయాలో తెలిసినవాడే.. రాళ్లేసిన ఆర్టీసీ కార్మికుల చేత క్షీరాభిషేకాలు చేయించాడు. తిట్టిపోసిన దిశ బాధితులతోనే హ్యాట్సాఫ్ అని చెప్పించుకున్నాడు. అత్యాచారాల విషయంలో దేశంలో కేసీఆర్ చేసిందే రైట్ అని ప్రజలు గొంతెత్తడంతో మోడీషా సహా యూపీ ఇతర రాష్ట్రాల సీఎంలకు కంఠగింపుగా మారింది.

ఇక ప్రధాని మోడీ కలలుగన్నట్టు తెలంగాణలో బీజేపీ వచ్చేసారి అధికారంలోకి రావడం అన్నది కష్టతరమైనదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా గెలవలేకపోయాడు. కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డిదీ అదే పరిస్థితి. జనాలు ఎంపీ ఎన్నికల్లో మోడీని చూసి ఓటేయబట్టే నడిచింది. రాష్ట్రాల్లో మోడీని చూసి ఓటేసే పరిస్థితి లేదు.

పైగా తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు కిందిస్థాయి నుంచి కేడర్, కార్యకర్తలు, నేతల బలం ఉంది. బీజేపీకి అది లేదు. రాష్ట్ర నాయకత్వంలోనూ అరువు తెచ్చుకున్న నాయకులే. అధ్యక్షుడే మారాలని కోరుకుంటున్న పరిస్థితి. నడిపించే నాయకుడు లేక.. క్షేత్రస్థాయిలో బలం లేక.. భరోసా నింపే నాయకత్వం లేని బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందంటే ఎవ్వరూ నమ్మలేని పరిస్థితి.. పైగా రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన కేసీఆర్ ను ఓడిస్తుందంటే ఎవ్వరూ నమ్మని పరిస్థితి.

కేసీఆర్ ప్రస్తుం ప్రయోగాలు చేస్తున్నారు. తెలంగాణ సమాజాన్ని పరీక్షిస్తున్నారు. వారి ఆలోచన, అసహనం చూసి చివర్లో పరిష్కరిస్తూ జేజేలు పలికించుకుంటున్నారు. ఎన్నికలు లేవు కాబట్టే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారు. ఎన్నికలు వస్తే ఇలాంటి ప్రయోగాలు చేయరు. పెద్ద అస్త్రాలు బయటకు తీస్తాడు. వాటితో కాంగ్రెస్, బీజేపీలు తట్టుకోవడం కష్టమేనంటున్నారు టీఆర్ఎస్ శ్రేణులు. ఓవరాల్ గా తెలంగాణలో అధికారంలోకి వద్దామని కలలుగంటున్న మోడీ ఆశలు ఆశలుగానే మిగిలిపోతాయని రాజకీయ విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు.