Begin typing your search above and press return to search.

లక్ష్మీపార్వతికి ఏమీ అనిపించటంలేదా ?

By:  Tupaki Desk   |   23 Sept 2022 10:22 AM IST
లక్ష్మీపార్వతికి ఏమీ అనిపించటంలేదా ?
X
తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి వైఖరి చాలా విచిత్రంగా ఉంది. తన భర్త ఎన్టీయార్ పేరును హెల్త్ యూనివర్సిటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసేసింది. ఎప్పటినుండో యూనివర్సిటీకి ఉన్న ఎన్టీయార్ పేరును తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరును ప్రభుత్వం పెట్టేసింది. దీనిపై చంద్రబాబునాయుడు అండ్ కో తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వాళ్ళు కూడా ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా అధికార భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా కూడా చేశారు. టీడీపీ తరపున గెలిచి జగన్ కి సన్నిహితుడిగా మారిన గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. రాజకీయంగా ఈ నిర్ణయం ప్రభుత్వానికి లాభమా ? నష్టమా ? అనేది అప్రస్తుతం.

ఇంతమంది ప్రభుత్వ చర్యను తప్పుపడుతున్నా ఎన్టీయార్ భార్య లక్ష్మీపార్వతి మాత్రం ఇప్పటివరకు నోరిప్పినట్లు లేదు. తన నిరసనను తెలిపినట్లు లేదు. ప్రభుత్వ చర్యను తప్పుపడుతూ అసలు మొదటి నిరసన రావాల్సిందే లక్ష్మీపార్వతి నుండి. ప్రభుత్వ చర్యను తప్పుపడుతు తన పదవికి ఆమె రాజీనామా చేసుంటే గౌరవంగా ఉండేది. కానీ ఆమె వైఖరి మాత్రం అందరి అంచనాలకు భిన్నంగా ఉండటమే ఆశ్చర్యంగా ఉంది.

యూనివర్సిటీకి తన భర్త పేరును తొలగించటం బహుశా లక్ష్మీపార్వతికి తప్పుగా అనిపించలేదేమో. లేకపోతే తప్పుగా అనిపించినా పదవిపోతుందేమో అనే భయంతో మాట్లాడకుండా కూర్చున్నారా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా పదవికి రాజీనామా చేయటం నూరుశాతం ఆమె వ్యక్తిగతమే అనటంలో సందేహం లేదు.

కానీ ఇక్కడ ప్రభుత్వం తీసేసిన పేరు స్వయంగా ఆమె భర్తదే కావటమే పాయింట్. పదవికి రాజీనామా చేయకపోయినా కనీసం ప్రభుత్వ నిర్ణయం తప్పని కూడా అనకపోవటమే విచిత్రంగా ఉంది. చంద్రబాబును బూచిగా చూపి ఇంతకాలం వైసీపీలో లక్ష్మిపార్వతి మేనేజ్ చేస్తూ వచ్చింది. ఇపుడు నోరు విప్పకపోవడం వల్ల ఇకపై ఆమెకు చంద్రబాబును నిందించే అవకాశం కూడా ఉండదు. ఈ విషయం ఆమెకు ఎపుడు అర్థం అవుతుందో మరి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.