Begin typing your search above and press return to search.

రిమోట్ ప్రధానిని కేసీఆర్ కోరుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   12 Feb 2022 3:29 AM GMT
రిమోట్ ప్రధానిని కేసీఆర్ కోరుకుంటున్నారా?
X
ఎవరెన్ని చెప్పినా.. బలమైన ప్రధానమంత్రి దేశానికి లేకపోతే ఎలా ఉంటుందన్న విషయం దేశ ప్రజలకు అనుభవమే. మోడీకి ముందు.. సుదీర్ఘకాలంగా బలమైన.. అత్యంత శక్తివంతమైన ప్రధాని లేకపోవటం చూస్తున్నదే. ప్రధానమంత్రిగా మోడీ వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లో భారత దేశ ప్రధానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులు.. ఆయన అనుసరించే విధానాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని ఇప్పటికే చూశాం. మొన్నటి వరకు దేశ ప్రధాని అన్నంతనే అత్యంత గౌరవ మర్యాదల్ని ప్రదర్శించటమే కాదు.. ఆయన మన ప్రధానమంత్రి.. ఆయన గౌరవం ఇవ్వకపోతే? ఎలా అని ప్రశ్నించిన కేసీఆర్ కు.. ఇప్పుడు కోపం వచ్చింది.

ఇంతకాలం ప్రధానిగా వ్యవహరిస్తున్న మోడీ మీద అప్పుడప్పుడు కోపం వచ్చినా.. ఆ విషయాన్ని చెప్పి.. చెప్పనట్లుగా పేర్కొనే ఆయన ఇప్పుడు ఓపెన్ అయిపోయారు. మోడీ మీద ఓపెన్ వార్ డిక్లేర్ చేశారు. ఢిల్లీకి వచ్చేస్తానని.. కేంద్రంపై కోట్లాటకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పేశారు. కాకపోతే.. కేంద్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న కేసీఆర్ కు.. దేశ ప్రధాని కుర్చీ మీద ఆశ లేదన్నట్లుగా ఆయన మాటలు ఉండటం గమనార్హం.

జనగామ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీ మీద కడుపులో ఉన్నదంతా కక్కేశారు. సిద్దిపేట ప్రజలు ముందుండి తనను పంపితే తెలంగాణను తీసుకొచ్చానని.. ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా పంపితే.. కేంద్రంతో కొట్లాడుతానని.. ఢిల్లీ గోడలను బద్ధలు చేస్తానని చెప్పుకొచ్చారు. కోట్లాట.. గోడల్ని బద్దలు కొట్టటం లాంటి మాటల కంటే కూడా.. కాస్తంత కన్వీన్స్ అయ్యే మాటల్ని చెబితే బాగుండేది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాను కేంద్ర రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న విషయాన్ని చెప్పిన సీఎం కేసీఆర్.. తాను ఎలాంటి రోల్ ప్లే చేయాలనుకుంటున్న విషయం మీదా ఆయన తన మాటల్లో చెప్పేశారు. దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే పాత్ర పోసించాల్సి వస్తే కోట్లాడతానని.. తాను పులి బిడ్డనని.. భయపడే వారెవ్వరూ లేరన్నారు.

ఈ మాటలన్ని బాగానే ఉన్నా.. అసలు విషయంలోనే తేడా కొట్టేస్తోంది. ఢిల్లీకి వెళ్లనున్న కేసీఆర్.. తనకు ప్రధాని పదవి మీద ఆసక్తి లేదన్న విషయం ఆయన మాటల్లో వినిపించటం గమనార్హం. సీఎం కేసీఆర్ మాటల్ని చూస్తే.. తమ రాష్ట్రానికి అవసరమైన నిదులు.. పథకాలు.. మొత్తంగా తమ మాట వినే ప్రధాని.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటయ్యేలా ఉండాలన్నదే కేసీఆర్ ఆలోచనగా చెప్పొచ్చు. దీనికి తగ్గట్లే కేసీఆర్ మాటలు ఉన్నాయని చెప్పాలి. ‘‘ఏడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ ఇవ్వటం లేదు. మోడీని వెళ్లగొట్టి.. తెలంగాణకు ఇచ్చేటోణ్ని తీసుకొస్తాం’’ అన్నకేసీఆర్ వ్యాఖ్యను చూస్తే.. ఈ దేశానికి శక్తివంతమైన ప్రధాని కంటే.. తాను.. తన లాంటి ప్రాంతీయ పార్టీల అధినేతలకు రిమోట్ మాదిరి ఆదేశం జారీ చేస్తే.. అందుకు స్పందించేలా వ్యవహరించే ప్రధానిని తాను కోరుకుంటున్న వైనాన్ని గులాబీ బాస్ స్పష్టం చేశారని చెప్పాలి.

17 ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రానికి చెందిన కీలక అధినేత చెప్పినట్లే దేశ ప్రధాని కుర్చీలో కూర్చున్న వారు వినేసే పరిస్థితి ఉంటే.. అత్యధిక ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రాల అధికార పార్టీ అధినేతల మాటలకు స్పందించే తీరు ఎలా ఉంటుందంటారు? ఒక్కసారి ఈ విషయం మీద యావత్ జాతి కాస్తంత సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంతకాలం బలహీనమైన ప్రధాని కుర్చీలో కూర్చున్నప్పుడు.. ఎదురైన అనుభవాల్ని చూశాం.మళ్లీ ఇప్పుడు ఆ తరహా ప్రధానమంత్రిని దేశానికి సీఎం కేసీఆర్ చూపించాలనుకుంటున్నారా?