Begin typing your search above and press return to search.

చినజీయర్ స్వామికి షాకిచ్చిన కేసీఆర్

By:  Tupaki Desk   |   15 Feb 2022 3:38 AM GMT
చినజీయర్ స్వామికి షాకిచ్చిన కేసీఆర్
X
అభిమానంతో ఉన్నప్పుడు ఆకాశానికి ఎత్తేయటం.. తేడా వచ్చినప్పుడు పాతాళానికి తొక్కేసేలా మాట్లాడటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో చూస్తూనే ఉంటాం.రాజకీయంగా ఆయన తీరు అందరికి తెలిసిందే. రాజకీయాల్లో అంత కటువుగా ఉండే ఆయన.. తాను ఎంతో భక్తిభావంతో పూజిస్తూ.. అభిమానిస్తూ.. పలు సందర్భాల్లో చిన జీయర్ స్వామి కాళ్లకు దండం పెట్టేందుకు కూడా వెనుకాడని కేసీఆర్.. తాజాగా ఆయనకే షాకిచ్చిన పరిణామం చోటు చేసుకుందని చెబుతున్నారు.

ఈ వాదనకు బలం చేకూరుస్తూ ముచ్చింతల్ కు సోమవారం సాయంత్రం రావాల్సిన సీఎం కేసీఆర్ హాజరు కాకపోవటంతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని పేర్కొన్న శాంతి కల్యాణాన్ని ఈనెల 19కు అనూహ్యంగా వాయిదా వేయటం ఇప్పుడు చర్చగా మారింది. చినజీయర్ స్వామిపై నిత్యం భక్తిభావంతో వ్యవహరించే సీఎం కేసీఆర్.. అనూహ్యంగా ఆయనపై ఎందుకు గుర్రుగా ఉన్నారు? ఆయన కార్యక్రమానికి వస్తానంటూనే రాకుండా ఎందుకు ఉన్నారు? అసలేం జరిగింది? అన్న ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి.

షెడ్యూల్ ప్రకారం చూస్తే.. సోమవారం ఉదయం సీఎం కేసీఆర్ ముచ్చింతల్ కు వెళ్లాల్సి ఉంది. ఆ కార్యక్రమం కాస్తా సాయంత్రానికి వాయిదా పడినట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఎదురుచూసి.. ఎదురుచూసిన మీడియా ప్రతినిధుల కళ్లకు.. కాళ్లకు అదనపు శ్రమ కలిగింది తప్పించి.. సీఎం కేసీఆర్ మాత్రం ముచ్చింతలకు రాలేదు. ఆయన్ను రప్పించేందుకు సోమవారం రాత్రి వరకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయన్న ప్రచారం సాగుతోంది. అయినప్పటికీ గర్రుగా ఉన్న కేసీఆర్ ముచ్చింతలకు రానని తేల్చినట్లుగా చెబుతున్నారు.

మొన్నటివరకు బాగానే ఉన్న కేసీఆర్.. ఉన్నట్లుండి చినజీయర్ స్వామితోనూ.. తనకు మాంచి దోస్త్ అయిన మైహోం రామేశ్వరరావు తో ఎందుకు చెడింది? ఎక్కడ చెడింది? లాంటి ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. దీనికి సమాధానం వెతికితే.. పరధాని నరేంద్ర మోడీ ముచ్చింతలకు రావటంతోనే తేడాలు వచ్చినట్లుగా చెబుతున్నారు. అసలు కారణం ఏమంటే.. శ్రీరామానుజ మహా విగ్రహావిష్కరణ శిలాఫలకంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు లేకపోవటం.. ఆ సమాచారాన్ని అధికారుల నుంచి సీఎంవోకు అందటంతో లొల్లి మొదలైనట్లుగా చెబుతారు.

తాను ఏ మోడీ మీదనైతే కారాలు.. మిరియాలు నూరుతున్నానో.. అదే మోడీని చినజీయర్ స్వామి ఆకాశానికి ఎత్తేయటం.. ఈ విగ్రహావిష్కరణకు మోడీ కంటే అర్హులు భారతదేశంలో మరెవరూ లేరని కీర్తించటం కేసీఆర్ కోపాన్ని మరింత పెంచిందని చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చినజీయర్ స్వామిజీ ఆయన్ను చల్లార్చేందుకు ప్రయత్నించినా.. ఫలించలేదని చెబుతారు.

కేసీఆర్ కోపాన్ని గుర్తించి.. ఆ విషయాన్ని సర్దుబాటు చేసేందుకు చినజీయర్ స్వామి తెగ శ్రమించినట్లుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ వచ్చిన సందర్భంలో సీఎం కేసీఆర్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించటం ద్వారా చినజీయర్ స్వామి సీఎం కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేసినా ఫలితం రాలేదంటున్నారు.

చివరకు రాష్ట్రపతి కు వచ్చేందుకు వీలుగా బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన వేళలో.. ఆయనకు స్వాగతం పలికిన సందర్భానికి సీఎం కేసీఆర్ వెళ్లినా.. ఆయనతో పాటు ముచ్చింతల్ కు రాకపోవటం గమనార్హం. దీంతో.. పేరు కారణంగా మొదలైన లొల్లికి తీర్చేందుకు సువర్ణమూర్తి ఆవిష్కరణ శిలాఫలకంపై కేసీఆర్ పేరును పెట్టారు. దీంతో ఆయన చల్లబడి ముగింపు ఉత్సవాలకు హాజరవుతారని ఆశించినా.. అదేమీ జరగకపోవటంతో.. సోమవారం జరగాల్సిన శాంతి కల్యాణాన్ని ఈ నెల 19కు వాయిదా వేస్తున్నట్లుగా చినజీయర్ స్వామి ప్రకటించారు. మరి.. ఆ లోపు సీఎం కేసీఆర్ కోపం చల్లారుతుందా? అన్నదిప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది.