Begin typing your search above and press return to search.

ట్రంప్ తెలివి తెలిసి షాక్ అవుతున్న అమెరికన్ వైద్యులు

By:  Tupaki Desk   |   26 April 2020 8:00 AM IST
ట్రంప్ తెలివి తెలిసి షాక్ అవుతున్న అమెరికన్ వైద్యులు
X
అత్యున్నత స్థానాల్లో ఉండే వారెంత బాధ్యతగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అందుకు భిన్నంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరు ఉంటోంది. తన మనసుకు తోచినట్లుగా మాట్లాడే అలవాటున్న ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని రేపుతున్నాయి. ఆయనకు ఎందుకు అనిపించిందో కానీ.. కరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు తనకొచ్చిన పిచ్చి ఆలోచనను మీడియా సమావేశంలో చెప్పేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మాటల మీద ఏ మాత్రం అదుపులేని ట్రంప్.. కరోనా వైరస్ విషయంలో తెంపరి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇచ్చిన ఉచిత సలహాను సరదాగా తీసుకోవాలే కానీ.. దాన్ని పాటిస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఇంతకూ ఆయనిచ్చిన సలహా ఏమంటే.. కరోనా సోకిన వ్యక్తి శరీరంలోకి డిస్ ఇన్ఫెక్టంట్లను ఎక్కిస్తే వైరస్ ను అంతమొందిచొచ్చు కదా? అన్నది ఆయన క్వశ్చన్. అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే.. కరోనా వైరస్ ఉన్న వారు తమ నోట్లో బ్లీచ్ లేదంటే ఐసోప్రొపైల్డ్ ఆల్కాహాల్ ను తీసుకోవటం లాంటిది.

అలాంటివి నేరుగా తీసుకుంటే వైరస్ చచ్చిపోవటం సంగతేమో కానీ.. ప్రాణాల మీదకు తెచ్చుకోవటం ఖాయమని హెచ్చరిస్తున్నారు. అధ్యక్ష స్థానంలో ఉన్న ట్రంప్ మరీ ఇంత బాధ్యతారాహిత్యంతో మాట్లాడటమా? అని విస్మయానికి గురవుతున్నారు. ఇంతకీ ట్రంప్ మాష్టారికి ఇంత తిక్క ఆలోచన ఎందుకు వచ్చిందంటారా? అక్కడికే వస్తున్నాం. ట్రంప్ మీడియా సమావేశానికి ముందు బిల్ బ్రియన్ అనే నిపుణుడు కరోనా మీద తాను చేసిన అధ్యయన రిపోర్టును అధ్యక్షుల వారి ముందు పెట్టారు.

ఆయన అధ్యయనం ప్రకారం గాలిలో తేమ.. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వైరస్ వేగంగా నశిస్తోందన్న విషయాన్ని తాము గుర్తించినట్లుగా ఆయన చెప్పారు. అంతేకాదు.. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ కేవలం 30 సెకన్లలో కరోనా వైరస్ ను అంతమొందిస్తుందన్న విషయం తమ పరిశోధనలో తేలినట్లు చెప్పారు.

సదరు నిపుణుడి మాటలు ట్రంప్ వారికి ఎలా అర్థమయ్యాయో కానీ.. మీడియా సమావేశంలో మాత్రం కరోనాను తగ్గించేందుకు మనిషి శరీరంలోకి డిస్ ఇన్ఫెక్టెంట్లను ఎందుకు ఎక్కించకూడదన్న మాట ఆయన నోటి నుంచి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటమా? అని అమెరికన్ వైద్యులు పలువురు మండి పడుతున్నారు. సమయం సందర్భం తో పని లేకుండా తనకు తోచినట్లుగా మాట్లాడే అలవాటున్న ట్రంప్ కరోనా వేళలోనూ అలానే మాట్లాడటం ఇప్పుడు సంచలనంగా మారింది.