Begin typing your search above and press return to search.

గుంటూరులో దారుణం..ఒకరికి బదులుగా మరొకరు డిశ్చార్జ్!

By:  Tupaki Desk   |   20 April 2020 12:20 PM IST
గుంటూరులో దారుణం..ఒకరికి బదులుగా మరొకరు డిశ్చార్జ్!
X
కుడి ఏడమైతే పొరపాటు లేదోయ్ అన్న పాట పాడుకోవటానికి బాగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి పొరపాట్లు కొత్త కష్టాల్ని తీసుకురావటమే కాదు.. ప్రాణాల మీదకు తీసుకొస్తుంటాయి. ఏపీలోని గూంటూరులో ఇప్పుడు ఇలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. విన్నంతనే ఉలిక్కిపడేలా ఉన్న ఈ ఉదంతం చూస్తే.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఇంత ఎక్కువగా ఉంటే.. పరిస్థితి ఏమిటి? అన్నభయాందోళనలు కలగటం ఖాయం.

గుంటూరుజిల్లా తాడేపల్లికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. అతడ్ని కాటూరి వైద్య కళాశాలలోని క్వారంటైన్ కు తరలించి చికిత్స చేశారు. ఇదిలా ఉంటే.. ఇక్కడే ఒక ట్విస్టు చోటు చేసుకుంది. ఒకేలాంటి పేరున్న ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉండటం.. ఒకరిని డిశ్చార్జి చేయాల్సింది మరొకరిని డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా అతడికి రూ.2వేలు ఇవ్వటమే కాదు.. డిశ్చార్జ్ పత్రాన్ని ఇచ్చి ఇంటికి పంపారు.

జరిగిన పొరపాటును గుర్తించిన అధికారులు.. పొరపాటుగా డిశ్చార్జి చేసిన వ్యక్తి ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆ వ్యక్తి ఇంట్లో వారితో కలిసిపోయిన విషయాన్ని గుర్తించారు. ఆసుపత్రికి రావాలని కోరితే ధ్రువీకరణ పత్రం చూపించి రానని చెప్పాడు. దీంతో జరిగిన విషయాన్ని వివరంగా చెప్పి.. అతన్ని.. అతని ఇంట్లో వారందరిని ఆసుపత్రికి తరలించారు. పొరపాటుగా డిశ్చార్జి చేసిన వ్యక్తిని ఐసోలేషన్ వార్డుకు తరలించగా.. వారి కుటుంబ సభ్యుల్ని క్వారంటైన్ కు పంపారు.