Begin typing your search above and press return to search.

పీపీఈల‌తో వైద్యులు ఉక్కిరిబిక్కిరి: ‌వేస‌విలో ఎంత క‌ష్ట‌ప‌డుతున్నారో తెలుసా?

By:  Tupaki Desk   |   30 May 2020 6:00 AM GMT
పీపీఈల‌తో వైద్యులు ఉక్కిరిబిక్కిరి: ‌వేస‌విలో ఎంత క‌ష్ట‌ప‌డుతున్నారో తెలుసా?
X
మ‌హ‌మ్మారి వైరస్ ప్ర‌బ‌ల‌డంతో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉన్నారు. అది రాకుండా జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. అయితే ఆ వైర‌స్ బారిన ప‌డిన బాధితుల‌కు వైద్యులు సేవ‌లు అందిస్తున్నారు. వారిని కాపాడ‌డానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వారు ఒక‌ర‌కంగా ప్రాణాల‌కు తెగించి మ‌రీ బాధితుల‌ను ర‌క్షించేందుకు పోరాడుతున్నారు. ఈ వైద్యం అందించే స‌మ‌యంలో.. ఆస్ప‌త్రిలో ఉన్నంత సేపు వైద్యులు త‌ప్ప‌నిస‌రిగా పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్ ‌(పీపీఈ) కిట్లు వేసుకోవాలి. ఎందుకంటే ఆ వైర‌స్ వారికి వ్యాపించే ప్ర‌మాదం ఉంది. అయితే గంట‌ల కొద్దీ చూపు బ‌య‌ట‌కు క‌నిపిస్తుంది.. కానీ మ‌నిషి శ‌రీరం కొంచెం కూడా బ‌య‌ట‌కు క‌నిపించ‌కుండా పూర్తిగా క‌ప్పివేసి ఉంటుంది. అదే పీపీఈ కిట్‌. శ‌రీరమంతా ఒక క‌వ‌ర్‌లో బంధించిన‌ట్టు ఉంటుంది. అయితే ఇప్పుడు ఉష్ణోగ్ర‌త్త‌లు భారీగా న‌మోద‌వుతున్నాయి. ఉక్క‌పోత‌.. వేడి తీవ్రంగా ఉంది. ఈ స‌మ‌యంలో పీపీఈ కిట్లు ధ‌రించిన వైద్యులు తీవ్రంగా ఉక్కిరిబిక్కిర‌వుతున్నారు. దీంతో వారు కూడా అనారోగ్యం బారిన ప‌డుతున్న ప‌రిస్థితులు.

పీపీఈ కిట్లు ధరిస్తే డీహైడ్రేషన్, దురద, చెమటపొక్కులు, బబుల్స్‌ వంటి చర్మవ్యాధులతో పాటు మానసిక రుగ్మతలకు వైద్యులు గురవుతున్నారు. మరికొంతమందిలో తలపై జుట్టు ఊడిపోతోంది. ఈ విధంగా అతి క‌ష్టం మీద వైద్యులు సేవ‌లందిస్తున్నారు. తెలంగాణలోని సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో సుమారు రెండు వేల మంది వైద్యులు, నర్సింగ్, పారా మెడికల్, పారిశుద్ధ్య‌, అంబులెన్స్‌ సిబ్బంది, లిఫ్ట్‌ ఆపరేటర్, పేషెంట్‌ కేర్‌ టేకర్‌తో పాటు పోలీస్‌ సిబ్బంది కరోనా విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించాల్సిందే. వీరిలో పల్మనాలజీ, జనరల్ ‌మెడిసిన్‌ వంటి ఫ్రంట్‌లైన్‌ వైద్యులు, జూనియర్‌ డాక్టర్లు, ఇంటర్నీస్, హౌస్‌ సర్జన్లతో పాటు నర్సింగ్‌ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి 8 నుంచి 12 గంటల పాటు నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్నారు.

పీపీఈ కిట్‌లో భాగంగా ముసుగులు, గాగుల్స్ తొలగించినప్పుడు చర్మం నుంచి చెమ‌ట అధికంగా వ‌స్తోంది. వైర‌స్‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ)లో భాగంగా ముసుగులు, చేతి తొడుగులు, హుడ్డ్ క్యాప్స్, ఫేస్ షీల్డ్స్, గాగుల్స్, గౌన్లు, షూ కవర్లు వేసుకుంటున్నారు. వీటివల్ల గంటలకు గంటలు వాళ్లు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవ‌డం లేదు. చాలా మంది వైద్యులు పీపీఈలను తొలగించిన తర్వాత వారి ముఖాలపై గుర్తులు, మొటిమలు, ఎర్రగా మారిపోయి ముఖం అంతా గాయాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా వారు ప్రాణాలు ప‌ణంగా పెట్టి పోరాడుతున్నారు.

ఈ పీపీఈ కిట్లు వేసుకున్న స‌మ‌యంలో వారు డీహైడ్రేషన్‌ సమస్యతో బాధ‌ప‌డుతున్నారు. వెంట‌నే ఆ కిట్లు తొల‌గించిన త‌ర్వాత అధికంగా నీరు తాగుతున్నారు. ఓఆర్‌ఎస్‌ ద్రావణంతోపాటు కొబ్బరి నీళ్లు తీసుకుంటున్నారు. అయితే వైద్యులు మాత్రం ఇటువంటి పరిస్థితిలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. అందుకే ప్ర‌పంచ‌మంతా హాట్సాఫ్ చెబుతోంది.