Begin typing your search above and press return to search.

మాకు కోవిషిల్డ్ మాత్రమే కావాలి ..ఎవరన్నారంటే !

By:  Tupaki Desk   |   16 Jan 2021 2:26 PM GMT
మాకు కోవిషిల్డ్ మాత్రమే కావాలి ..ఎవరన్నారంటే  !
X
దేశవ్యాప్తంగా ఈ రోజు (శనివారం) కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనప్పటికీ, ఇప్పటికీ చాలామందికి ఓ క్లారిటీ మాత్రం లేదు. కోవాగ్జిన్, కోవీషీల్డ్‌ లలో ఏ వ్యాక్సిన్ ఎంచుకోవాలన్న ఆప్షన్ లేకపోవడంతో వ్యాక్సినేషన్‌ పట్ల చాలామందిలో అపోహలు,సందేహాలు నెలకొన్నాయి. సామాన్యులే కాదు ఆఖరికి వైద్యులు సైతం వ్యాక్సిన్ విషయంలో తమకు ఆప్షన్ ఇవ్వాల్సిందేనని అంటున్నారు.

తాజాగా ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి చెందిన వైద్యులు తమకు కోవాగ్జిన్ వద్దని కోవీషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే ఇవ్వాలని సూపరింటెండెంట్‌ కు లేఖ రాయడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి చెందిన రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తమకు భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ ఇవ్వొద్దని, సీరమ్ ఇన్ ‌స్టిట్యూట్ తయారుచేసిన కోవీషీల్డ్‌ నే ఇవ్వాలని సూపరింటెండెంట్ ‌కు లేఖ రాశారు. కోవాగ్జిన్ ట్రయల్స్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆ వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల తాము ఆందోళనకు గురవుతున్నామని, ఇప్పటికే అన్ని క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న కోవీషీల్డ్‌ వ్యాక్సినే తమకు ఇవ్వాలని కోరారు.

వైద్యుల మాట ఇలా ఉంటే అదే రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి చెందిన సూపరింటెండెంట్ శనివారం కోవాగ్జిన్ తీసుకోవడం గమనార్హం. నిజానికి మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఇంకా జరుగుతుండగానే కోవాగ్జిన్‌కు అనుమతినివ్వడంపై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. పూర్తి స్థాయి డేటా సమర్పించకుండానే ఆ వ్యాక్సిన్ ‌కు ఎలా అనుమతిస్తారని విపక్షాలు కూడా ప్రశ్నించాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఒకటి కంటే ఎక్కువ వ్యాక్సిన్లను ఇస్తున్నారని... వ్యాక్సిన్ విషయంలో ఆయా దేశాల్లోనూ ఆప్షన్ ఇవ్వలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ గతంలోనే వెల్లడించారు.