Begin typing your search above and press return to search.

హైకోర్టుకు చేరిన డాక్టర్ సుధాకర్ వ్యవహారం

By:  Tupaki Desk   |   19 May 2020 10:55 AM IST
హైకోర్టుకు చేరిన డాక్టర్ సుధాకర్ వ్యవహారం
X
ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తి సస్పెన్షన్ కు గురైన డాక్టర్ సుధాకర్ వ్యవహారం హైకోర్టుకు చేరింది. నర్సీపట్నం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో అనస్థీషియా నిపుణుడిగా డాక్టర్ సుధాకర్ పనిచేసేవారు. ఈ మహమ్మారి టైంలో ఆస్పత్రుల్లో కనీస వసతులు లేవంటూ హద్దులు మీరి వ్యాఖ్యానించడంతో సస్పెన్షన్ కు గురయ్యారు.

ఇటీవల విశాఖలో అర్ధనగ్నంగా నిరసన తెలిపి రచ్చ చేసిన డాక్టర్ సుధాకర్ విషయంలో విశాఖ పోలీసులు అమానుషంగా వ్యవహరించారని పేర్కొంటూ టీడీపీ తెలుగు మహిళా రాష్ట్ర విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాసిన లేఖను, దీనికి జత చేసిన వీడియోను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. సోమవారం విచారణ చేపట్టింది.

డాక్టర్ సుధాకర్.. ప్రధాని మోడీని, సీఎం జగన్ ను దూషించాడని.. పోలీసులతో గొడవపడ్డాడని.. అందుకే ఆయనను సస్పెండ్ చేశారన్నారు. ఇక డాక్టర్ సుధాకర్ తో అనుచితంగా ప్రవర్తించిన ఓ కానిస్టేబుల్ ను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసిందని ప్రభుత్వ అడ్వకేట్ వాదించారు. దీంతో కేసు విచారణను హైకోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది. డాక్టర్ సుధాకర్ ను హైకోర్టులో హాజరు పరచాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

ఇక డాక్టర్ సుధాకర్ ను దుస్తులు ఊడదీసి అర్థనగ్నంగా చేసి తాళ్లతో చేతులు వెనక్కి కట్టి రోడ్డుపై పడుకోబెట్టి అమానుషంగా వ్యవహరించారని హైకోర్టులో పిల్ దాఖలైంది. విజయవాడ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు ఈ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై జూడిషియల్ కమిటీతో విచారణ జరపాలని అభ్యర్థించారు.