Begin typing your search above and press return to search.

కరోనా భయంతో యాంటీ మలేరియా డ్రగ్‌ తీసుకున్న డాక్టర్ మృతి !

By:  Tupaki Desk   |   3 April 2020 10:50 AM GMT
కరోనా భయంతో యాంటీ మలేరియా డ్రగ్‌ తీసుకున్న డాక్టర్ మృతి !
X
కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు కరోనావైరస్ కి సరైన వ్యాక్సిన్ కనిపెట్టలేకపోవడం దురదృష్ట కరం. కరోనాకి సరైన మందు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. అలాగే కరోనా వల్ల చనిపోయే మృతులు కూడా అంతకంతకు పెరిగిపోతున్నారు. అయితే , కరోనా కి మందు లేకపోవడంతో కొంతమంది కరోనా రాకుండా ముందు జాగ్రత్తగా మలేరియా డ్రగయిన ‘హైడ్రోక్సిక్లోరోక్విన్‌ ' ను తీసుకుంటున్నారు.

అయితే , కరోనా వైరస్‌ చికిత్స కోసం ఉపయోగించే హైడ్రాక్సిక్లోరోక్వైన్‌ - యాంటీ బయోటిక్‌ అజిత్రో మైసిన్‌ లు రోగి హృదయ స్పందనలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని యూఎస్‌ కు చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా చికిత్సలో ఉపయోగించే ఈ మలేరియా యాంటీ బయోటిక్‌ డ్రగ్‌ కాంబినేషన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ కు దారి తీస్తుందని ఆరెగాన్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ యూనివర్శిటీ అండ్‌ ఇండియానా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాంబినేషన్‌ డ్రగ్‌ల కారణంగా అనారోగ్యం తో ఉన్న వారి పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉందంటున్నారు. ఈ కాంబినేషన్‌ ను వాడుతున్న వారు దాని ద్వారా ఎదురయ్యే దుష్ప్రభావాలపై తప్పకుండా జాగ్రత్త వహించాలి అని ఫ్రొఫెసర్‌ ఎరిక్‌ స్టెకర్‌ తెలిపారు.

కాగా, తాజాగా హైడ్రోక్సిక్లోరోక్విన్‌ తీసుకోవడం వల్ల ఒకరు చనిపోయారు. గౌహటిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనస్థియాలజిస్ట్‌గా పని చేస్తోన్న అస్సాంకు చెందిన 44 ఏళ్ల డాక్టర్‌ ఉత్పల్‌ జిత్‌ బర్మన్‌ మార్చి 29వ తేదీన మరణించారు. అయన హైడ్రోక్సిక్లోరోక్విన్‌ తీసుకోవడం తో మరణించినట్లు ఆయన సహచర వైద్యులు తెలియజేశారు. కరోనా వైరస్‌ పేషేంట్స్ కి చికిత్స చేస్తున్న వారు కరోనా బారిన పడే అవకాశం ఉందని భావించిన వారు ఈ హైడ్రోక్సిక్లోరోక్విన్‌ ను తీసుకోవాల్సిందిగా భారత వైద్య పరిశోధనా మండలి సూచించింది.

కరోనా వైరస్‌ నివారణకు హైడ్రోక్సిక్లోరోక్విన్‌ సరైన మందు కాదు. నేను దీన్ని తీసుకున్న తర్వాత నాకు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని ఆదివారం మధ్యాహ్నం 1.04 గంటలకు డాక్టర్‌ బర్మన్‌ తోటి వైద్యులకు మెసేజ్ పెట్టారు. ఆ తర్వాత రెండు గంటల తర్వాత నర్సుగా కొనసాగుతున్న డాక్టర్‌ బర్మన్‌ భార్య, -బర్మన్‌ సహచర వైద్యులకు ఫోన్‌ చేసి ఆయనకు గుండెపోటు వచ్చినట్లు చెప్పారు. సహచర వైద్యులు బర్మన్‌ ఇంటికి వెళ్లి ఆయన్ని మరో ప్రైవేటు ఆస్పత్రికి హుటాహుటిన తీసుకెళ్లారు. అక్కడ 20 నిమిషాల తర్వాత బర్మన్‌ చనిపోయారు. గుండె కండరాలకు హఠాత్తుగా రక్త సరఫరా నిలిచిపోవడం వల్ల ఆయన మరణించినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటు ఎందుకు వచ్చిందో వారు చెప్పలేక పోయారు. అయితే , ప్రాథమిక సమాచారం ప్రకారం బర్మన్‌ ది గుండెపోటు వచ్చే వయస్సు కాదని - యాంటి మలేరియా డ్రగ్‌ తీసుకోవడం వల్లనే ఆయన మత్యువు బారిన పడ్డారని సహచర వైద్యులు చెప్పారు. దీన్ని బట్టి చూస్తే మొత్తంగా ..కరోనా సోకుతుందేమో అనే అనుమానంతో ..తొందరపడి - హైడ్రోక్సిక్లోరోక్విన్‌ తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు అని వైద్య నిపుణులు చెప్తున్నారు.