Begin typing your search above and press return to search.

మరోలా అనుకోవద్దు.. మీ పిల్లలు చదివిన మీడియం ఏంది వెంకయ్య?

By:  Tupaki Desk   |   11 Nov 2019 6:45 AM GMT
మరోలా అనుకోవద్దు.. మీ పిల్లలు చదివిన మీడియం ఏంది వెంకయ్య?
X
ఉప రాష్ట్రపతి స్థానంలో ఉన్న వెంకయ్యనాయుడిని ఒక ప్రశ్న వేయాలని ఎంతో ఆసక్తిగా ఉంది. ఎందుకంటే.. ఆయన చెబుతున్న తాజా మాటలే ప్రశ్నించాలన్న కోరిక కలగటానికి కారణం. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఇంగ్లిషులో బోధన తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

ధనికులు.. మధ్యతరగతి పిల్లలు ఇప్పటికే ఇంగ్లిషు మీడియంలో చదువుతున్న వేళ.. పేదలు.. బడుగు.. బలహీన వర్గాల వారు మాత్రమే తెలుగు మీడియంలో చదువుతున్నారు. ఇలాంటి వేళ ప్రభుత్వ స్కూళ్లను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. ఇందుకు భిన్నంగా మేధావుల పేరుతో కొందరు చేస్తున్న ప్రచారం చూస్తున్నప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పక తప్పదు.

అమ్మభాషను విస్మరిస్తే అనర్థాలు తప్పవన్న వెంకయ్య మాటను చూసినప్పుడు.. మనసులో చప్పున ఒక ప్రశ్న మెదలక మానదు. అమ్మ భాషకు వెంకయ్య ఇచ్చే ప్రాధాన్యతను ఎవరూ తప్పు పట్టరు. అయితే.. అంతటి పెద్ద మనిషి సైతం.. తన కుమారుడు హర్షవర్ధన్.. (టొయోటో కంపెనీ కార్ల డీలర్ షిప్ తో పలు షోరూంలు నిర్వహిస్తుంటారు).. కుమార్తె దీపా వెంకట (ఎన్జీవో కార్యక్రమాలు చేస్తుంటారు) ఇద్దరూ ఏ మీడియంలో చదివించారు? అన్న ప్రశ్నకు సమాధానం చెబితే బాగుంటుంది.

ఒకవేళ వారిద్దరిని తెలుగు మీడియంలోనూ ఉన్నత విద్య కూడా చదివించి ఉంటే.. నిజంగానే స్ఫూర్తిదాయకం. అదేసమయంలో మనమళ్లు.. మనమరాళ్లు ఇప్పుడే మీడియంలో చదివిస్తున్నారో చెప్పిన తర్వాత అమ్మభాష గురించి మాట్లాడితే బాగుంటుందేమో వెంకయ్య జీ. ఉన్నత ఆదాయ వర్గాల వారికి అమ్మభాష మీద ఎంత మక్కువ ఉన్నా.. వారి పిల్లల్నిఇంగ్లిషు మీడియంలోనే చదివిస్తున్నారు. అలాంటప్పుడు సర్కారు స్కూళ్లలో ఇంగ్లిషులో పాఠాలు బోధిస్తే జరిగే నష్టమేంది?