Begin typing your search above and press return to search.

రెస్టారెంట్కు వెళ్లినప్పుడు సర్వీస్ ఛార్జ్ చెల్లిస్తున్నారా..?

By:  Tupaki Desk   |   4 Jun 2022 3:30 PM GMT
రెస్టారెంట్కు వెళ్లినప్పుడు సర్వీస్ ఛార్జ్ చెల్లిస్తున్నారా..?
X
వీకెండ్లో సరదాగా ఫ్యామిలీతోనో.. స్నేహితులతోనో అలా రెస్టారెంట్కు వెళ్తే.. అక్కడ చివరలో సోంపుతో పాటు సర్వీస్ ట్యాక్స్ అనే వడ్డింపు కూడా కనిపిస్తుంది. అది చూశాక.. అప్పడిదాక ఎంతో ఉత్సాహంగా గడిపిన వారిలో నిరుత్సాహం ఆవహిస్తుంది.

చాలా మంది కస్టమర్లు తాము సర్వీస్ ట్యాక్స్ ఎందుకు కట్టాలంటూ ప్రశ్నించినా.. రెస్టారెంట్ల యాజమాన్యం తగ్గేదేలే.. కట్టాల్సిందే అనడంతో కట్టకతప్పడం లేదు. అయితే దీనిపై వినియోగదారుల మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జ్ విధించడం చట్టవిరుద్ధమని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

మీరు రెస్టారెంట్కు వెళ్తున్నారా..? అక్కడ భోజనం చేసిన తర్వాత బిల్లుతో పాటు మీకు సర్వీస్ ఛార్జ్ కూడా వడ్డిస్తున్నారా..? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీలపై వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. రెస్టారెంట్ ద్వారా సర్వీస్ ఛార్జీ విధించడం చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

సర్వీస్ ఛార్జ్ విధించడం వల్ల కస్టమర్లపై ప్రభావం పడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. భోజనం వడ్డించిన సిబ్బందికి సర్వీస్ ఛార్జ్ లేదా టిప్ ఎంత ఇవ్వాలన్నది వినియోగదారుడి విచక్షణపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. రెస్టారెంట్కు వెళ్తున్నాడంటే.. సర్వీస్ ఛార్జ్ చెల్లించేందుకు సిద్ధపడి వెళ్తున్నారని అర్థం కాదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. సర్వీస్ ఛార్జ్ కట్టకపోతే ప్రవేశం లేదని ఏ రెస్టారెంట్ యాజమాన్యమైన చెబితే అది కచ్చితంగా వినియోగదారుల భద్రతా చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని అన్నారు.

దీనిపై ఎన్ఆర్ఏఐ స్పందిస్తూ, "సర్వీస్ ఛార్జ్.. అతిథులకు సేవ చేసే సిబ్బందికి మాత్రమే వర్తిస్తుందని.. ఆ ఛార్జ్ ద్వారా వచ్చే నగదును రెస్టారెంట్లో పనిచేసే సిబ్బందికే ఇస్తామని తెలిపారు. రెస్టారెంట్లు మొత్తం బిల్లులో 10 శాతం సర్వీస్ ఛార్జీగా వసూలు చేస్తాయని చెప్పారు.

ఈ అంశంపై వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. రెస్టారెంట్లు తమకు నచ్చినట్లుగా సర్వీస్ ఛార్జ్ జోడిస్తాయని.. నిబంధనల ప్రకారం ఇది ఐచ్ఛికంగా ఉండాలని అన్నారు. కస్టమర్ ఇష్టంగా ఇస్తే తప్ప బలవంతంగా సర్వీస్ ఛార్జ్ వసూల్ చేయకూడదని స్పష్టం చేశారు.