Begin typing your search above and press return to search.

పోలింగ్ శాతం ఎందుకు తగ్గిపోయిందో తెలుసా ?

By:  Tupaki Desk   |   19 April 2021 5:31 AM GMT
పోలింగ్ శాతం ఎందుకు తగ్గిపోయిందో తెలుసా ?
X
తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల ముందు పోలింగ్ శాతంపై ఎవరిలో ఎన్ని అంచనాలున్నాయో ఎవరికీ తెలీదు. అయితే పోలింగ్ జరిగిన తర్వాత ఓటింగ్ శాతం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. 2019 ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ జరిగింది. కాబట్టి ఇపుడు కూడా కాస్త అటో ఇటో పోలింగ్ శాతం నమోదవుతుందని చాలామంది అంచనా వేసుకున్నారు.

ఉపఎన్నికను వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కాబట్టి కచ్చితంగా ఓటింగ్ శాతం బాగా ఉంటుందని అంచనా వేసుకున్నారు. అయితే జరిగిన పోలింగ్ 64 శాతం అని తేలేటప్పటికి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇంత తక్కువ పోలింగ్ జరుగుతుందని ఊహించలేదు. మండిపోతున్న ఎండలు, కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కారణంగా ఓటింగ్ తగ్గుతుందనే అనుమానం వచ్చింది. అయితే ఎంత తగ్గినా ఈ స్ధాయిలో పడిపోతుందని మాత్రం ఊహించలేదు.

సరే మొత్తానికి పోలింగ్ శాతం ఇంత దారుణంగా పడిపోవటానికి కారణం ఏమిటనే అన్వేషణ మొదలైంది. దానికి రెండుపార్టీల్లోని కొందరు నేతలు చెప్పిన కారణం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది. ఇంతకీ ఆ కారణం ఏమిటయ్యా అంటే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయకపోవటమేనట. ఒక విధంగా చూస్తే ఈ కారణం నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే ఓటుకు ఇతాని కొన్ని సెక్షన్ల ఓటర్లకు డబ్బు ముట్టచెప్పటం మనకు దశాబ్దాలుగా అలవాటైపోయింది.

ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, సంక్షేమ పథకాలు అమలు చేసినా డబ్బులు పంచాల్సిందే అన్నట్లుగా తయారైంది ఎన్నికల వాతావరణం. అలాంటిది ఒక్కసారిగా ఆ పద్దతిని బ్రేక్ చేయటమంటే మామూలు విషయంకాదు. ఇపుడు ఉపఎన్నికలో జరిగిందిదేనట. రెండేళ్ళుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నపుడు మళ్ళీ ఓటర్లకు డబ్బులు పంచాల్సిన అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారట.

అధికారపార్టీయే డబ్బులు పంచనపుడు మనకు మాత్రం అవసరం ఏముందని చంద్రబాబునాయుడు కూడా అనుకున్నారట. ఈ కారణంగానే నేరుగా ఓటర్లకు డబ్బులు పంచలేదని తెలుస్తోంది. అయితే చివరి నిముషంలో రెండుపార్టీల నేతలు కొందరికి డబ్బులు పంచారట. అయితే ఈ పంచటం కూడా గతంలో జరిగినదానితో పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలట. ఓట్లకు డబ్బులు తీసుకోవటం అలవాటైపోయిన సెక్షన్లు తమకు డబ్బులు అందకపోవటంతో నిరాస చెందినట్లు సమాచారం. దాంతో ఉపఎన్నికలో ఓట్లేయటంపై పెద్దగా ఆసక్తి చూపలేదట.