Begin typing your search above and press return to search.

ఓటు వేయకపోతే ఈ దేశాల్లో ఏమి చేస్తారో తెలుసా ?

By:  Tupaki Desk   |   1 Dec 2020 2:58 PM GMT
ఓటు వేయకపోతే ఈ దేశాల్లో ఏమి చేస్తారో తెలుసా ?
X
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) పోలింగ్ ముగియగానే ఇతర దేశాల్లో ఓటు హక్కు వినియోగంపై చర్చ మొదలైపోయింది. గ్రేటర్ పోలింగ్ కు ఇతర దేశాల్లో ఓటు హక్కు వినియోగానికి ఏమిటి సంబంధం ? సంబంధం ఉంది. అదేమిటంటే గ్రేటర్ లో ఓట్లు వేసిన వారి శాతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 37 మాత్రమే. 6 గంటలకు పోలింగ్ ముగిసిందన్న విషయం తెలిసిందే. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారిని మాత్రం ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతిస్తారు. 5 గంటలకు నమోదైన ఓట్లు 35 శాతం. మహాఅయితే మరో మూడు లేదా నాలుగు శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది.

గ్రేటర్ ఎన్నికలంటేనే 85 శాతం అర్బన్ ఏరియాకు సంబంధించిన ఓటర్లే ఉంటారు. పైగా పోలింగ్ కారణంగా ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించింది. అయినా పోలింగ్ శాతం ఇంత తక్కువగా ఉండటంతో రాజకీయపార్టీలకు పెద్ద షాక తగిలినట్లయ్యింది. ఈ కారణం వల్లే ఇతర దేశాల్లో ఎన్నికలు జరిగినపుడు పోలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందనే విషయమై చర్చ ప్రారంభంమైపోయింది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 22 దేశాల్లో నిర్బంధ ఓటింగ్ అమల్లో ఉంది. బ్రెజిల్, గ్రీసు, ఈజిప్టు, ఆస్ట్రేలియా, బెల్జియం, ఈక్వెడార్, పెరూ, ఇటలీ, స్విట్జర్లాండ్, థాయ్ ల్యాండ్, సింగపూర్ లాంటి మరికొన్ని దేశాల్లో నిర్బంధ ఓటింగ్ అమల్లో ఉంది. ఈ దేశాల్లో జనాలు తమ ఓటు హక్కును వినియోగించుకోకపోతే రకరకాల శిక్షలు అమల్లో ఉన్నాయి.

బ్రెజిల్, ఈక్వెడార్, సింగపూర్, పెరు, ఆస్రియా, బెల్జియం దేశాల్లో ఓటు వేయకపోతే పెనాల్టి కట్టాల్సిందే. గ్రీస్, ఈజిప్టు దేశాల్లో ఓటు వేయకపోతే ఏకంగా జైలు శిక్ష విధిస్తారు. ఇటలీలో ఓటు వేయని వారి వివరాలు పాంప్లెట్లలో ప్రకటిస్తారు. బెల్జియంలో అయితే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హతగా ప్రకటిస్తారు. బొలీవియాలో అయితే జీతం నిలిపేస్తారు. ఓటు వినియోగంపై కొన్ని దేశాల్లో కఠినమైన నిబంధనలున్నాయి కాబట్టే అక్కడ నూరుశాతం ఓటు హక్కు వినియోగం ఉందట.

మరి మనదేశంలో మాత్రం ఎందుకు ఇటువంటి నిబంధనలు అమల్లోకి రావటం లేదు ? ఒకవేళ వచ్చినా జనాలు ఆమోదిస్తారా ? ఎందుకంటే మనదేశంలో జనాభా సుమారు 140 కోట్లు. వీరిలో తక్కువలో తక్కువ ఓటు హక్కున్న వారి సంఖ్య 100 కోట్లన్నా ఉంటుంది. ఓటు హక్కు వినియోగం అన్నది ఆయా ప్రాంతాల్లోని అక్షరాస్యత పైన కూడా ఉంటుంది. విదేశాల్లో బహుశా అక్షరాస్యత ఎక్కువగా ఉండవల్లే ప్రజలు తమ హక్కులను ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి మనదేశంలో కూడా ముందు అక్షరాస్యతపై దృష్టి పెట్టి తర్వాత ఓటు హక్కుపై చట్టాలు చేస్తే బాగుంటుందేమో.