Begin typing your search above and press return to search.

తిరుపతి ఉపఎన్నికలో జగన్ టార్గెట్ ఏమిటో తెలుసా ?

By:  Tupaki Desk   |   23 Nov 2020 3:20 PM IST
తిరుపతి ఉపఎన్నికలో జగన్ టార్గెట్  ఏమిటో తెలుసా ?
X
తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో జగన్మోహన్ రెడ్డి భారీ టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు పార్టీ నేతల సమాచారం. ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్ధి ఎవరన్నది పక్కన పెట్టేస్తే ప్రతిపక్షాల్లో దేనికి కూడా కనీసం డిపాజిట్ కూడా వచ్చేందుకు లేదని జగన్ మంత్రులు, సీనియర్ ఎంఎల్ఏలకు స్పష్టంగా చెప్పారట. తిరుపతి లోక్ సభలో 15.75 లక్షల ఓటర్లున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి 7,22,877 ఓట్లొస్తే, తెలుగుదేశంపార్టీకి 4,94,501 ఓట్లు వచ్చాయి. దీని ప్రకారం వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన బల్లి దర్గాప్రసాదరావు 2.28 లక్షల ఓట్ల మెజారిటితో గెలిచారు.

సరిగ్గా ఇక్కడే జగన్ ఓ లాజిక్ లేవదీశారట. ప్రతిపక్షంలో ఉన్నపుడే వైసీపీ అభ్యర్దికి 2.28 లక్షల ఓట్ల మెజారిటి వస్తే అధికారంలో ఉన్నపుడు జరగబోయే ఉపఎన్నికలో ఎంకెంత మెజారిటి రావాలి ? అన్నదే జగన్ లాజిక్. జగన్ అంచనా ప్రకారం వైసీపీ అభ్యర్ధికి తక్కువలో తక్కువ 10 లక్షల ఓట్లు పడాలట. అంటే వైసీపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్ధి గెలుపు దేశంలోనే చరిత్ర సృష్టించాలనేది జగన్ టార్గెట్ గా అర్ధమైపోతోంది. దీనివల్ల రెండు అంశాలు స్పష్టమవుతాయి.

మొదటిదేమో మెజారిటిలో వైసీపీ అభ్యర్ధి దేశంలోనే అత్యంత భారీ గెలుపు సాధించిన నేతగా చరిత్ర సృష్టిస్తారు. ఇక రెండోదేమిటంటే అధికారపార్టీపై జనాల్లో వ్యతిరేకత లేకపోగా మరింత సానుకూలంగా ఉన్నారనే సంకేతాలు బలంగా పంపినట్లవుతుంది. ఎందుకంటే జనాలంతా జగన్ పరిపాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటూ ప్రతిపక్షాల ప్రచారానికి గట్టి సమాధానం దొరికినట్లవుతుందన్నది జగన్ ఆలోచన. ఇదే సందర్భంగా జగన్ అంచనాలు వేసేట్లుగా వైసీపీ అన్ని ఓట్లు వస్తాయా ? అని ఓ సారి చూద్దాం.

తిరుపతి లోక్ సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. చిత్తూరు జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి, సూళ్ళూరుపేట ఉన్నాయి. వీటిల్లో సూళ్ళూరుపేట, గూడూరు, సత్యవేడు ఎస్సీ నియోజకవర్గాలు. మొన్న బల్లికి వచ్చిన 2.28 లక్షల మెజారిటిలో ఎస్సీ నియోజకవర్గాలే కీలక పాత్రను పోషించాయి. సత్యవేడులో 42 వేలు, గూడూరులో 45 వేలు, సూళ్ళూరుపేటలో 73 వేల ఓట్లమెజారిటి వచ్చింది. ప్రతిపక్షంలో ఉండి పోటీచేస్తేనే ఇన్నేసి వేల మెజారిటి సాధించినపుడు అధికారంలో ఉన్నపుడు జరగబోయే ఉపఎన్నికలో ఇంకా ఎక్కువ మెజారిటి రావాలని జగన్ టార్గెట్ ఫిక్స్ చేశారట.

అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలే తమ టార్గెట్ రీచయ్యేట్లు చేస్తాయని జగన్ గట్టి నమ్మకంతో ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అనేక సామాజికవర్గంలోని జనాలకు వేలాది కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అవన్నీ తమకు ఓట్లుగా రిటర్న్ గిఫ్ట్ రూపంలో కనబడతాయని అధికారపార్టీ నేతలు భావిస్తున్నారు. జగన్ అంచనా వేసినట్లు నిజంగానే రిటర్న్ గిఫ్ట్ వస్తే మాత్రం రికార్డు సృష్టంచటం ఖాయంగానే అనిపిస్తోంది. చూద్దాం ఎవరి అంచనాలు ఎలాగున్నా అంతిమంగా తీర్పు చెప్పేది మాత్రం ఓటర్లే కదా.