Begin typing your search above and press return to search.

వ్యాక్సినేషన్లో ఏపి స్ధానమేంటో తెలుసా ?

By:  Tupaki Desk   |   13 May 2021 5:30 AM GMT
వ్యాక్సినేషన్లో ఏపి స్ధానమేంటో తెలుసా ?
X
కోవిడ్ వ్యాక్సినేషన్లో ఏపి అట్టడుగు స్ధానంలో ఉందంటు పదే పదే చంద్రబాబునాయుడు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. టీకాలు వేయించే విషయంలో చంద్రబాబు చెబుతున్నది నిజమేనా ? ఇందుకు తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబసక్షేమ శాఖ ప్రకటించిన జాబితానే సమాధానం చెప్పింది. ఆ జాబితా ప్రకారం ఏపి 10వ స్ధానంలో ఉంది. టాప్ టెన్ స్టేట్స్ వ్యాక్సినేషన్ కారణంగా దేశంలో 17 కోట్లమందికి వ్యాక్సినేషన్ జరిగింది. టీకాల కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్న అత్యధిక 10 రాష్ట్రాల జాబితాలో ఏపి పదోస్ధానంలో నిలిచిందని స్వయంగా కేంద్రమే ప్రకటించింది.

మొదటిస్ధానంలో మహారాష్ట్ర నిలిచింది. ఈ రాష్ట్రంలో 1.86 కోట్లమందికి వ్యాక్సినేషన్ జరిగింది. దేశం మొత్తంమీద అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రం కూడా మహారాష్ట్రయే. దీని తర్వాత రాజస్ధాన్ లో 1.45 కోట్లమందికి వ్యాక్సినేషన్ జరిగింది. 1.44 కోట్ల టీకాలతో మూడోస్ధానంలో ప్రధానమంత్రి సొంతరాష్ట్రం గుజరాత్ ఉంది. 1.39 కోట్ల మందికి టీకాలు వేయించిన ఉత్తరప్రదేశ్ 4వ స్ధానంలో నిలిచింది.

ఇక మొన్ననే ఎన్నికలు జరిగిన పశ్చిమబెంగాల్లో 1.21 కోట్లమందికి టీకాలు వేయించటం ద్వారా 5వ స్ధానంలో నిలబడింది. 1.07 కోట్ల టీకాలు వేయించిన కర్నాటకలో 6వ స్ధానంలో ఉంది. 87.32 లక్షల వ్యాక్సినేషన్లతో మధ్యప్రదేశ్ 7వ స్ధానంలో ఉంది. 81.12 లక్షల టీకాలు వేయించటం ద్వారా 8వ స్ధానంలో బీహార్ నిలిచింది. బీహార్లో జరిగినట్లే కేరళలో కూడా 81.12 లక్షల మంది వ్యాక్సినేషన్ జరిగి 9వ స్ధానంలో నిలబడింది. 73.4 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేయించి 10వ స్ధానంలో ఏపి నిలిచింది.

కేంద్రం ప్రకటించిన జాబితాలో తెలంగాణా లేదు. దేశరాజధాని ఢిల్లీ కూడా జాబితాలో కనబడలేదు. అంటే టీకాలు వేయించటంలో ఏపి తర్వాత మరో 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత రాష్ట్రాలున్నట్లు అర్ధమవుతోంది. జగన్మోహన్ రెడ్డి అడిగినన్ని టీకాలను కేటాయించుంటే రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఇంకా స్పీడుగా జరిగుండేదేనటంలో సందేహంలేదు. టీకాలు వేయించటంలో ఏపి టాప్ టెన్ జాబితాలో ఉన్నది వాస్తవమైతే చంద్రబాబు, లోకేష్ అండ్ కో మాత్రం జాబితాలో అట్టడుగున ఉందని పదే పదే ఎలా చెబుతున్నారు ?