Begin typing your search above and press return to search.

ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ తాజా ర్యాంక్ ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   8 Aug 2020 11:00 PM IST
ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ తాజా ర్యాంక్ ఎంతో తెలుసా?
X
కొన్నిసార్లు అంతే. సంక్షోభాలు కొందరికి కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకునేలా చేస్తుంటాయి. ఆ కోవలోకే వస్తారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. ముకేశ్ కు మాత్రం ఒక్కొక్క అడుగు ముందుకు వేసేలా చేయటమే కాదు.. తన ముందున్న వారిని అధిగమించే అవకాశాల్ని ఇస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన మరో మెట్టు ఎక్కారు. మొన్నటివరకు ఆయన ఉన్న స్థానం మరింత మెరుగై.. ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో నాలుగో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

ప్రపంచ కుబేరుల్లో చాలామందిని ఇప్పటికే దాటేసిన ఆయనకు ముందు మరో ముగ్గురే ఉన్నారు. వారిలో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ మొదటి స్థానంలో ఉండగా.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రెండోస్థానంలో నిలిచారు. మూడో సథానంలో ఫేస్ బుక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జుకర్ బర్గ్ నిలిచారు. అమెజాన్ అధిపతి 187 బిలియన్ డాలర్లతో ఉంటే.. ముకేశ్ 80.6 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో నిలిచారు.

ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న ఆర్నాల్ట్ 80.2బిలియన్ డాలర్లతో ఐదో స్థానానికి దిగిపోయారు. లగ్జరీ వస్తువుల్ని ఉత్పత్తి చేసే ఫ్రాన్స్ కు చెందిన ఆర్నాల్ట్ కరోనా కారణంగా ఆయన కంపెనీ షేర్లు దారుణంగా దెబ్బ తిన్నాయి. దీంతో.. ఆయన సంపద దగ్గర దగ్గర 25.1 బిలియన్ డాలర్లు కరిగిపోవటంతో.. ఆయన ఐదో స్థానానికి తగ్గిపోయారు.

వాస్తవానికి కరోనా మొదట్లో ముకేశ్ కు చెందిన చమురు వ్యాపారం మీద ప్రభావం చూపినా.. అనూహ్యంగా జియో ఫ్లాట్ ఫాం మీద పలు కంపెనీలకు వాటాలు అమ్మటం ద్వారా తన సంపదను అంతకంతకూ పెంచుకోవటమే కాదు.. కంపెనీకి ఉన్న రుణాల్ని తీర్చేసి.. రుణ రహిత కంపెనీగా మార్చారు.నాటి నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధరలు ఉత్సాహంతో ఉరుకలెత్తుతున్నాయి. ప్రస్తుతంఈ కామర్స్ వ్యాపారం మీద ఫోకస్ చేసిన ముకేశ్.. రానున్న రోజుల్లో మరెన్ని మేజిక్కులు చేస్తారో చూడాలి.