Begin typing your search above and press return to search.

కరోనా 40 కేసులు తేల్చటం వెనుకున్న శ్రమ ఎంతంటే?

By:  Tupaki Desk   |   9 March 2020 5:12 AM GMT
కరోనా 40 కేసులు తేల్చటం వెనుకున్న శ్రమ ఎంతంటే?
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. భారత్ ను విడిచి పెట్టటం లేదు. రోజులు గడిచే కొద్దీ కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజులోనే ఆరు కొత్త కేసులు అధికారికంగా నమోదయ్యాయి. ఉన్నంతలో ఆనందించే విషయం ఏమంటే.. కరోనా కారణంగా ఇప్పటివరకూ మరణాలేమీ చోటు చేసుకోకపోవటం సానుకూలాంశంగా చెప్పాలి.

కరోనా వైరస్ కేసుల్ని తేల్చేందుకు పలు రాష్ట్రాల్లో ప్రత్యేక కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లోని కరోనా కేసుల్ని ప్రాథమికంగా తేల్చేందుకు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అనుమానంగా తేలిన కేసుల్ని మరోసారి క్రాస్ చెక్ చేసి ఫైనల్ చేసేందుకు వీలుగా ఫూణెకు శాంపిల్స్ పంపుతారు.
అనుమానితుల నుంచి రక్తం తీసుకునేటప్పుడే రెండు శాంపిల్స్ సేకరిస్తారు. అందులో ఒకదానిని స్థానికంగా ఉన్న వైరాలజీ ప్రత్యేక ల్యాబ్ లో పరీక్షిస్తారు. ఫలితం తేడాగా ఉంటే.. మరోసారి సునిశితంగా పరీక్షలు జరిపేందుకు వీలుగా దేశంలోని రెండు కేంద్రాల (ఒకటి కేరళలో.. రెండోది ఫూణెలో)కు పంపుతారు. అక్కడ జరిపే పరీక్షలతో కరోనా ఉందా? లేదా? అన్న విషయాన్ని ఫైనల్ చేసి అధికారికంగా ప్రకటిస్తారు.

ఈ కసరత్తు మొత్తం చేస్తున్నది నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఇప్పటివరకూ 40 కేసుల్ని పాజిటివ్ గా తేల్చిన ఈ ల్యాబ్ లు ఎంతలా శ్రమిస్తున్నాయో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. నలభై కేసులను తేల్చటానికి ముందు నాలుగు వేల శాంపిల్స్ ను క్షుణ్ణంగా పరీక్షలు జరిపారంటే.. వడబోత ఎంత కఠినంగా ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది.

ఈ పరీక్షలు నిర్వహించే శాస్త్రవేత్తలకు అపాయం పొంచి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే.. ల్యాండ్ మైన్ మీద కాలు పెట్టినట్లుగా వారి పని ఉంటుంది. ఏ చిన్న అజాగ్రత్త దొర్లినా ప్రమాదకర వైరస్ వీరి దరి చేరటం ఖాయమని చెప్పాలి. ఇంత రిస్క్ ఉన్నా.. విధి నిర్వహణలో ఉండే కమిట్ మెంట్ తో ఈ సంస్థల్లో పని చేసే సిబ్బంది పని చేస్తున్నారని చెప్పాలి.
రోజంతా ప్రత్యేక రక్షణ దుస్తుల్ని ధరించి కరోనా పరీక్షల కోసం పని చేస్తున్న వైనం తెలిసినంతనే.. ఇంత కసరత్తు జరుగుతుందా? అన్న భావన కలగటం ఖాయం. దేశవ్యాప్తంగా మొత్తం వంద ల్యాబులు ఉన్నప్పటికీ.. తుది ఫలితాన్ని ప్రకటించే ముందు మాత్రం..ఫూణె.. కేరళలోని రెండు ల్యాబ్ ల్లో క్షుణ్ణంగా పరీక్షలు జరిపిన తర్వాత మాత్రమే ప్రకటిస్తారు.
గడిచిన నెలలో దేశవ్యాప్తంగా తమకు నాలుగు వేల కరోనా అనుమానితుల శాంపిల్స్ అందాయని.. వాటిని పరీక్షలు జరపగా.. చివరకు నలభై శాంపిల్స్ ఫలితాలు పాజిటివ్ గా తేలినట్లు ఐసీఎంఆర్ఈసీడీ- 1 అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న రామన్ ఆర్ గంగఖేద్కర్ వెల్లడించారు. ప్రత్యేక రక్షణ పరికరాలు.. శాంపిల్స్ ను పరీక్షించే శాస్త్రవేత్తల వ్యక్తిగత భద్రత కోసం ప్రత్యేక భద్రతా దళాలు పని చేస్తుంటాయి.

కరోనా నిర్ధారణ కోసం తుది పరీక్షలు నిర్వహించే వేళ.. ఒక్కో శాంపిల్ ను పది గంటల నుంచి 24 గంటల పాటు పరీక్షలు జరిపిన తర్వాత మాత్రమే తాము ఫైనల్ ఫలితాల్ని ప్రకటిస్తామంటున్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు ఒక పాజిటివ్ కేసును ఫైనల్ చేయటం వెనుక ఇంత భారీ కసరత్తు జరుగుతుందా? అన్న ఆశ్చర్యానికి గురి కావటం ఖాయం.