Begin typing your search above and press return to search.

ప్ర‌పంచంలో ఇప్ప‌టి దాకా.. ఎంత వ్యాక్సిన్ వేశారో తెలుసా?

By:  Tupaki Desk   |   6 Jun 2021 1:30 PM GMT
ప్ర‌పంచంలో ఇప్ప‌టి దాకా.. ఎంత వ్యాక్సిన్ వేశారో తెలుసా?
X
మ‌న దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ ఏ విధంగా సాగుతోందో తెలిసిందే. న‌త్త‌న‌డ‌క‌ను మ‌రిపిస్తున్న ఈ కార్య‌క్ర‌మం ద్వారా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కేవలం 20 కోట్ల పైచిలుకు మందికి మాత్ర‌మే తొలిడోసు వ్యాక్సిన్ వేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. ప్ర‌పంచంలో ఇంత‌క‌న్నా దారుణ పరిస్థితులు ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నివేదిక‌ను ప‌రిశీలిస్తే ఈ విష‌యం తెలుస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌పంచ వ్యాప్తంగా 200 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేసిన‌ట్టు డ‌బ్ల్యూహెచ్ వో తెలిపింది. అయితే.. ఇందులో 60 శాతం డోసులు చైనా, అమెరికా, భార‌త్ లోనే వేశార‌ని వెల్ల‌డించింది. మ‌రో 7 దేశాల్లో 15 శాతం వ్యాక్సిన్ వేసిన‌ట్టు ప్ర‌క‌టించింది. అంటే.. ప్ర‌పంచంలో ఇప్ప‌టి వ‌ర‌కు వేసిన మొత్తం వ్యాక్సిన్ లో 75 శాతం వ్యాక్సిన్ ఈ ప‌ది దేశాల్లోనే వేశార‌న్న‌మాట‌!

చైనా, అమెరికా.. త‌మ దేశాల్లోని 50 శాతం మందికిపైగా ప్ర‌జ‌ల‌కు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తిచేశాయి. భార‌త్ లో 20 కోట్ల మందికే తొలిడోసు వేశారు. అంటే.. రెండు డోసులు వేసుకున్న‌వారు ఇంకా త‌క్కువ‌గా ఉంటారు. మ‌రి, అలాంట‌ప్పుడు.. ఈ మూడు దేశాల్లోనే 60 శాతం వ్యాక్సిన్ వేసి ఉంటే.. మిగిలిన దేశాల్లో ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.

ప్రపంచ ఆరోగ్య‌సంస్థ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ కు సీనియ‌ర్ స‌ల‌హాదారుగా ఉన్న బ్రూస్ ఐల్ వార్డ్ మీడియా స‌మావేశంలో ఈ వివ‌రాలు వెల్ల‌డించారు. క‌రోనా నిరోధానికి వ్యాక్సినేష‌నే కీల‌క‌మ‌ని, అన్ని దేశాలూ వ్యాక్సిన్ పై దృష్టి సారించాల‌ని సూచించారు. ప్ర‌పంచ దేశాల‌కు కొవిడ్ టీకాల‌ను అందించేందుకు ఏర్ప‌డిన కూట‌మి (కొవాక్స్‌) ద్వారా 127 దేశాల‌కు వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేసేందుకు కృషి చేస్తోంద‌న్నారు. భార‌త్ లో కొవిడ్ తీవ్ర ఎక్కువ‌గా ఉన్నందున వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రాకు ఇబ్బందులు వ‌చ్చిన‌ట్టు తెలిపారు.

మొత్తానికి బ్రూస్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం చూస్తే.. ప్ర‌పంచంలో వ్యాక్సినేష‌న్ అమెరికా, చైనాలో త‌ప్ప మ‌రే దేశంలోనూ స‌రిగా సాగ‌ట్లేద‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రి, ఇలాంటి ప‌రిస్థితుల్లో కొవిడ్ పై దేశాలు ఎలాంటి పోరాటం సాగిస్తాయనే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అస‌లే థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో భ‌యాందోళ‌న‌లు రెట్టింపు అవుతున్నాయి.