Begin typing your search above and press return to search.

జనవరికల్లా కొత్త జిల్లాలు ఖాయమేనా ?

By:  Tupaki Desk   |   13 Nov 2020 3:20 PM IST
జనవరికల్లా కొత్త జిల్లాలు ఖాయమేనా ?
X
రాష్ట్రంలో జనవరి కల్లా కొత్త జిల్లాల ఏర్పాటు ఖాయమని తేలిపోయిందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. పరిస్ధితులన్నీ అనుకూలిస్తే జనవరి 26వ తేదీకి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన చేయాలని ప్రభుత్వం బాగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికి ఉన్న 13 జిల్లాల స్ధానంలో 25 కానీ లేదా 26 జిల్లాలు కానీ చేయాలని అనుకుంటోందంటే కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే. అలాగే వివిధ పథకాల్లో కేంద్రం మంజూరు చేస్తున్న నిధుల విషయంలో కొత్త జిల్లాలకే మొదటి ప్రాధాన్యత దక్కుతోంది.

ఎందుకంటే కేంద్రంలోని చాలా పథకాలకు నిధులను జిల్లాలను యూనిట్ గా తీసుకునే మంజూరు చేస్తోంది. ఉత్తరాధి రాష్ట్రాల్లోని చాలా జిల్లాలకు అత్యధికంగా నిధులు దక్కుతున్నాయంటే ఇదే ప్రధాన కారణం. అందుకనే ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇప్పటికే ప్రతిపాదిత కొత్త జిల్లాల్లో కలెక్టర్లేట్ భవనాలను, ఎస్పీ కార్యాలయాలను ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై జిల్లాల యంత్రాంగం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

విశాఖపట్నం జిల్లాను మూడుగా విభజించాలని డిసైడ్ అయ్యింది. అనకాపల్లి, జిల్లాతో పాటు అరకు జిల్లాను ఏర్పాటు చేయబోతున్నారు. అనకాపల్లి జిల్లా కేంద్రాన్ని అనకాపల్లిలోని ఏర్పాటు చేస్తుండగా అరక జిల్లా కేంద్రాన్ని మాత్రం పాడేరులో ఏర్పాటు చేయబోతున్నారు. అనకాపల్లి జిల్లా కేంద్రానికి అవసరమైన భవనాల నిర్మాణానికి తుమ్మపాల చక్కెర కర్మాగారం భూములతో పాటు కొత్తూరులో నిర్మిస్తున్న ఆర్డీవో కార్యాలయం భవనాలను కూడా పరిశీలించారు.

ఇక తూర్పుగోదావరి జిల్లాకు ఇపుడు రాజమండ్రి కేంద్రం. దీనికి అదనంగా కాకినాడ, అమలాపురం జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. ఇక్కడ కూడా కొత్త జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ ఏర్పాటు తదితరాలకు భవనాలను చూస్తున్నారు. పశ్చమగోదావరి జిల్లాకు ప్రస్తుతం ఏలూరు కేంద్రం. అయితే కొత్తగా నరసాపురం జిల్లా ఏర్పాటవుతోంది. ఈ జిల్లాకు నరసాపురంలోనే ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ భవనాలను కలెక్టరేట్ గా ఏర్పాటు చేయటానికి పరిశీలిస్తున్నారు.

కృష్ణా జిల్లాకు ప్రస్తుతం మచిలీపట్నం కేంద్రంగా ఉంటోంది. కొత్తగా విజయవాడ జిల్లాగా అవుతోంది. దీనికి బందరు రోడ్డులోని ఆర్ అండ్ బీ భవనాన్ని కలెక్టరేట్ గా మార్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు. గుంటూరు జిల్లా మూడుగా ఏర్పడబోతోంది. కొత్తగా బాపట్ల, నరసరావుపేట కొత్త జిల్లాలవుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో కలెక్టరేట్ భవనాల ఏర్పాటుకు అవసరమైన భూములను వెతుకుతున్నారు.

ఇదే పద్దతిలో కొత్తగా ఏర్పాటు కాబోయే జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలు, ఎస్పీ కార్యాలయాల కోసం అందుబాటులో ఉన్న భవనాలను చూస్తున్నారు. ఇఫ్పటికే ప్రతిపాదిత కొత్త జిల్లాల్లో ఆర్డీవో భవనాలు కానీ లేకపోతే సబ్ కలెక్టర్ భవనాలు కానీ లేదా ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు, పనిచేయకుండా ఉన్న చక్కెర ఫ్యాక్టరీ భవనాల్లాంటివి ఏవైనా ఉంటే అలాంటి వాటి జాబితాను ప్రస్తుత జిల్లా యంత్రాంగాలు రెడీ చేసి చీఫ్ సెక్రటరీకి అందించేశాయి. కాబట్టి ప్రభుత్వం స్పీడు చూస్తుంటే జనవరి 26కి కొత్త జిల్లాల ఏర్పాటు ఖాయమనే అనిపిస్తోంది.