Begin typing your search above and press return to search.

కరోనాను చైనా ఎలా కంట్రోల్ చేయగలిగిందో తెలుసా?

By:  Tupaki Desk   |   4 March 2020 5:13 AM GMT
కరోనాను చైనా ఎలా కంట్రోల్ చేయగలిగిందో తెలుసా?
X
ప్రపంచాన్ని షేక్ చేస్తున్న కరోనా (కొవిడ్ -19) వైరస్ మన ముంగిట్లోకి వచ్చేసింది. చైనాలోని మహానగరాల్లో ఒకటైన వూహాన్ లో మొదలైన ఈ మహమ్మారి ఇప్పుడు హైదరాబాద్ వరకూ వచ్చేసింది. ఈ వైరస్ గురించి భయపడటం కంటే.. దీని మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం వచ్చేసింది. కొవిడ్ ను కంట్రోల్ చేయటంలో చైనాకు ఎలా సాధ్యమైందన్న విషయాన్ని తెలుసుకోవటం ద్వారా.. దానికి చెక్ పెట్టేసేందుకు ఉన్న అవకాశాలేమిటో ఇట్టే అర్థమవుతాయి.
కొవిడ్ వైరస్ తొలుత బయటపడిన హుబెయ్ ప్రావిన్స్ జనాభా ఆరు కోట్లు అయితే.. ఈ పిశాచి వైరస్ పుట్టినిల్లు అయిన వుహాన్ మహానగర జనాబా 1.15 కోట్లు. వేలాదిమందికి ఒక్కసారిగా సోకిన ఈ వైరస్ ను ఆ దేశంలో ఎలా కంట్రోల్ చేసిందన్న విషయంలోకి వెళితే.. వైరస్ మిగిలిన వారికి వ్యాప్తి చెందకుండా ఆ దేశం అనుసరించిన విధానాలే కారణంగా చెప్పాలి.

చైనా ఏమీ అమెరికా.. బ్రిటన్ మాదిరి సంపన్న దేశం కాదు. ఆ దేశంలో ఇప్పటికి సగం మందికి పైగా నిరుపేదలే. మురికివాడల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మరి.. అలాంటి దేశం కరోనా లాంటి మాయదారి వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలా కంట్రోల్ చేసిందన్న విషయంలోకి వెళితే.. అష్టదిగ్భందమే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు హుబెయ్ ప్రావిన్స్ సరిహద్దుల్ని మూసేసింది. ఆ ప్రావిన్స్ లో ప్రజా రవాణాతో పాటు.. ప్రైవేటు రవాణాను నిలిపివేశారు. ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేశారు. ఆఫీసుల్లో పని చేయాల్సి ఉన్నా.. వర్క్ ఫ్రం హోం తరహాను అమలు చేశారు. ఇక.. ఎవరైనా వైరస్ బారిన పడితే ఇంట్లోనే ఉండి సమాచారం ఇవ్వాలని.. వారిని తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
అదే సమయంలో వైరస్ బారిన పడే వేలాది మందికి అవసరమైన భారీ ఆసుపత్రుల్ని రోజుల వ్యవధిలోనే తయారు చేసే అద్భుతమైన సాంకేతికతను.. తన సత్తా ఎంతన్నది ప్రపంచానికి చాటి చెప్పేలా వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే సిద్ధం చేసింది. రెండు వారాల వ్యవధిలో మరో 1500 పడకల ఆసుపత్రిని నిర్మించింది.

రోగుల కోసం ఆడిటోరియంలు.. స్టేడియంలు.. హోటళ్లు.. ఖాళీగా ఉండే ప్రభుత్వ కార్యాలయాల్ని ఆసుపత్రులుగా మార్చేశారు. వుహాన్ లో దగ్గర దగ్గర 13 భవనాల్లో 13,348 పడకలతో తాత్కాలిక కరోనా కేంద్రాల్ని సిద్ధం చేశారు. ఓపక్క రోగులకు సరిపోయే ఆసుపత్రుల్ని సిద్ధం చేయటంతో పాటు.. వ్యాధిని కంట్రోల్ చేసే చికిత్సా విధానాన్ని సిద్ధం చేశారు. కరోనాను కంట్రోల్ చేసే వ్యాక్సిన్ ఏదీ అందుబాటులో లేకున్నా.. సార్స్ తరహాలోనే కరోనా చికిత్సా విధానాన్ని చేపట్టారు. ముఖ్యంగా శ్వాస వ్యవస్థను దెబ్బ తీసే ఈ వైరస్ ను కంట్రోల్ చేసేందుకు.. ఆ వ్యవస్థ కుప్పకూలకుండా ఉండేలా చికిత్సా విధానాన్ని అనుసరించారు. దీనికి మెరుగైన ఫలితాలు రావటంతో మిగిలిన వారంతా దీన్నే ఫాలో కావటం షురూ చేశారు.

వూహాన్ నగరం కొవిడ్ పిశాచి పట్టేయటంతో.. అందరిని ఇళ్లకే పరిమితం చేయటంతో పాటు.. ఆ మహానగరంలో ఉన్న విదేశీయులకు మనోధైర్యాన్ని కలిగించేలా ప్రభుత్వం ప్రత్యేక వలంటీర్లను నియమించింది. ఒక్కో అపార్ట్ మెంట్ నుంచి ఒక్క వ్యక్తిని మాత్రమే బయటకు అనుమతి ఇవ్వటం.. వారితో సొంతింట్లో బంధీలుగా ఉన్న వారికి అవసరమైన ఆహారాన్ని.. మందుల్ని.. ఇతరత్రా వసతులు చూసేలా చర్యలు తీసుకుంది. మాస్కుల కొరత తీవ్రంగా ఉండడటంతో యుద్ధ ప్రాతిపదికన రోజుల్లోనే ఈ ఫ్యాక్టరీలు సిద్ధమయ్యేలా చర్యలు తీసుకుంది. ఇలాంటి చర్యలే కొవిడ్ మహమ్మారిని కంట్రోల్ చేయగలిగింది. ఇప్పుడు మన దేశానికి చెందిన అధికారులు.. ప్రభుత్వాలు చేయాల్సిందేమిటో అర్థమైనట్లేగా?