Begin typing your search above and press return to search.

'జాతీయ పతాక రూపశిల్పి' పేరు అధికారికంగా కనిపించదు .. కారణం ఏంటి ?

By:  Tupaki Desk   |   12 March 2021 9:08 AM GMT
జాతీయ పతాక రూపశిల్పి పేరు అధికారికంగా కనిపించదు .. కారణం ఏంటి ?
X
పింగళి వెంకయ్య.. అనగానే అందరికి గుర్తుకు వచ్చేది జాతీయ జెండా. కానీ అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రభుత్వానికి చెందిన అధికారిక వెబ్‌ సైట్లలో కనిపించే జాతీయ పతాక చరిత్రలో ఎక్కడా పింగళి వెంకయ్య పేరు ప్రస్తావన ఉండదు. ప్రభుత్వ వెబ్‌ సైట్‌లో మాత్రం, 1921లో బెజవాడలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సదస్సులో ఒక ఆంధ్రా యువకుడు ఒక జెండాను తయారు చేసి గాంధీకి చూపించారు అని ప్రస్తావించారు. భారత జాతీయ పతాకం రూపకల్పనలో చాలా చరిత్ర ఉంది. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఈ పతాకం పురుడు పోసుకుంది. ఇప్పుడున్న రూపానికి రాకముందు అనేక మార్పులకు లోనయింది. అందులో పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం ప్రధానమైనదని, ఇప్పటి జాతీయ పతాకానికి అదే మాతృక అని చరిత్ర పుస్తకాల్లో చెప్తారు. పాఠ్యపుస్తకాల్లోనూ జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య అని బోధిస్తున్నారు. కానీ.. ఈ అంశంపై స్పష్టత లేదు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో అనేక రకాలుగా మారిన జెండాల్లో పింగళి రూపొందించిన జెండా ప్రధానమైనదే అయినప్పటికీ ఇప్పటి జాతీయ పతాకం దానికి భిన్నమైనదని పలువురు వాదిస్తుంటారు.

మహాత్మా గాంధీ స్వయంగా ఒక వ్యాసంలో రాసినదాని ప్రకారం.. 1921లో విజయవాడలో కాంగ్రెస్ సదస్సు జరిగినపుడు పింగళి కొన్ని పతాకాల నమూనాలు తయారు చేసి గాంధీజీకి చూయించారు. హిందువులు, ముస్లింలకు చిహ్నంగా ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఒక జెండా తయారు చేయాలని గాంధీ చెప్పారు. పింగళి అలాగే చేయగా అందులో చరఖా బొమ్మ చేర్చాలని హన్స్ ‌రాజ్ సూచించారు. అలా చేర్చిన పతాకం గాంధీజీకి బాగా నచ్చింది. ఎరుపు, ఆకుపచ్చ రంగులకు పైన.. ఇతర మతస్తులందరికీ చిహ్నంగా తెలుపు రంగును చేర్చాలని గాంధీ సూచించారు. అయితే, పింగళి ఆ జెండాను తయారు చేసి తీసుకురావటం కొంత ఆలస్యం కావటంతో ఆ కాంగ్రెస్ సదస్సు ముందు దానిని ఆమోదానికి పెట్టలేకపోయారు. కాంగ్రెస్ అధికారికంగా ఆమోదించకపోయినప్పటికీ, పింగళి జెండా భారీ స్థాయిలో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చింది. జలియన్‌వాలా బాగ్ దురంతానికి నిరసనగా చేపట్టిన కార్యక్రమంలో 1923 ఏప్రిల్ 13న నాగ్‌పూర్‌లో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు తొలిసారిగా పింగళి జెండాను ఎగురవేశారు. దీనికి బ్రిటిష్ పోలీసులు అభ్యంతరం చెప్పారు. ఆ ఘర్షణ ఒక మహోద్యమంగా మారింది.

నాగ్‌పూర్ కాంగ్రెస్ కమిటీ..జెండా సత్యాగ్రహానికి పిలుపునిచ్చింది. స్వరాజ్యం కాంక్షిస్తూ సాగిన ఆ జెండా సత్యాగ్రహం అనతి కాలంలోనే జాతీయ స్థాయికి పెరిగింది. జాతీయోద్యమం దేశవ్యాప్తంగా తీవ్రంగా బలపడింది. పింగళి రూపొందించిన జెండా తన వంతు పాత్ర పోషించింది. భారత జాతీయ పతాకంగా ఆ జెండా అప్పుడే గుర్తింపు పొందింది. ఆ తర్వాత పింగళి రూపొందించిన పతాకంలో ఎరుపు రంగు స్థానంలో కాషాయ రంగును చేర్చుతూ కొత్త త్రివర్ణ పతాకాన్ని ఖరారు చేసింది. అందులో పైన కాషాయ రంగు కింద ఆకుపచ్చ రంగు మధ్యలో తెల్ల రంగు ఉండేలా మార్పులు చేశారు. చరఖా అలాగే కొనసాగింది. అయితే.. 1921లో పింగళి రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని ‘స్వరాజ్’ పతాకం గాను.. 1931లో ఆమోదించిన త్రివర్ణ పతాకాన్ని ‘పూర్ణ స్వరాజ్ పతాకం’గాను.. కొందరు అభివర్ణిస్తున్నారు.

1947లో భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించేనాటికి జాతీయ పతాకాన్ని ఖరారు చేసే బాధ్యత రాజ్యాంగసభ తీసుకుంది. స్వాతంత్ర్యోద్యమంలో కాంగ్రెస్ పార్టీ జెండాగా ఉన్న చరఖాతో కూడిన త్రివర్ణ పతాకాన్ని భారత జాతీయ పతాకంగా అంగీకరించటానికి విముఖత వ్యక్తమైంది. దీంతో, చరఖా స్థానంలో బుద్ధుడి ధర్మ చక్రాన్ని చేర్చాలని రాజ్యాంగసభ చైర్మన్ డాక్టర్ అంబేడ్కర్ ప్రతిపాదించారు. అయితే.. ధర్మచక్రానికి బదులు అశోక చక్రాన్ని చేర్చాలన్న ప్రతిపాదన మీద ఏకాభిప్రాయం వ్యక్తమైంది. కానీ చరఖాను తొలగించటం గాంధీజీకి ఏమాత్రం ఇష్టం లేదు.అయినా రాజ్యాంగసభ సిఫారసు మేరకు నెహ్రూ ప్రభుత్వం అశోక చక్రం ఉన్న జెండానే ఖరారు చేసింది. నేటి జాతీయ జెండాకు మూలమైన త్రివర్ణ పతాకపు స్థూల రూపం.. పింగళి వెంకయ్య 1921లో రూపొందించిన జెండాకు.. గాంధీ సూచించిన మార్పులు చేయటం ద్వారా తయారైన జెండా అని చెప్పవచ్చు.