Begin typing your search above and press return to search.

రాజ‌కీయ ఆట‌లో రాణిస్తారా?

By:  Tupaki Desk   |   31 Oct 2021 12:30 AM GMT
రాజ‌కీయ ఆట‌లో రాణిస్తారా?
X
వివిధ క్రీడ‌ల్లో దేశం త‌ర‌పున ప్రాతినిథ్యం వ‌హించి ప్ర‌పంచ వేదిక‌ల్లో అద్భుత విజ‌యాల‌తో త్రివ‌ర్ణ ప‌తాకాన్ని రెప‌రెప‌లాడించిన ఎంతో మంది భార‌త ఆట‌గాళ్లు.. రాజ‌కీయాల్లోనూ త‌మ సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లెట్టి విజ‌య‌వంత‌మ‌య్యారు. అటు మైదానంలో ఆట‌తో అద‌ర‌గొట్టిన వాళ్లు.. ఇటు రాజ‌కీయ సంగ్రామంలో మాట‌ల‌తోనూ ఆక‌ట్టుకున్నారు. క్రీడాకారులు రాజ‌కీయాల్లో చేర‌డం భార‌త్‌లో సాధార‌ణ‌మే. తాజాగా భార‌త టెన్నిస్ దిగ్గ‌జం లియాండ‌ర్ పేస్‌.. బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఆధ్వ‌ర్యంలో ఆమె పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్‌లో చేరారు. మ‌రోవైపు వెరీ వెరీ స్పెష‌ల్ మ‌న హైద‌రాబాదీ క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ త్వ‌ర‌లోనే బీజేపీ తీర్థం పుంచుకోనున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది.

టెన్నిస్ ఆట‌గాడిగా దేశానికి లియాండ‌ర్ పేస్ ఎన్నో గొప్ప విజ‌యాలు అందించారు. మూడు ద‌శాబ్దాల కెరీర్‌లో ఎన్ని రికార్డులు ఖాతాలో వేసుకున్నారు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌లో పేస్ నెగ్గిన కాంస్య‌మే.. ఇప్ప‌టికీ ఒలింపిక్స్‌లో టెన్నిస్‌లో భార‌త్‌కు అందిన ఏకైక ప‌త‌కం. మ‌రోవైపు పురుషుల డ‌బుల్స్‌, మిక్స్‌డ్ డ‌బుల్స్‌లో క‌లిపి పేస్ 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సొంతం చేసుకున్నారు. టెన్నిస్‌లో దిగ్గ‌జంగా ఎదిగిన ఆయ‌న‌.. ఇప్పుడు టీఎంసీ త‌ర‌పున త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను నిర్మించుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. మ‌రోవైపు ఇత‌ర రాష్ట్రాల్లోనూ పాగా వేయాల‌నే ప‌ట్టుదల‌తో ఉన్న దీదీ.. వ‌చ్చే ఏడాది జ‌రిగే గోవా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే గోవాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పేస్‌కు కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మ‌రోవైపు త‌న మ‌ణిక‌ట్టు మాయాజాలంతో బ్యాటింగ్‌లో అద‌ర‌గొట్టి టీమ్ఇండియాకు ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాలు అందించ‌డంలో కీల‌క పాత్ర పోషించిన మాజీ క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ రాజ‌కీయాల్లోకి అడుగులు వేయ‌బోతున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. మైదానంలో త‌న సొగ‌సైన బ్యాటింగ్‌తో అద‌ర‌గొట్టిన ఆయ‌న‌.. ఇప్పుడు బీజేపీ త‌ర‌పున త‌న రాజ‌కీయ కెరీర్‌ను ఆరంభిస్తార‌నే ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం చేజిక్కించుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న బీజేపీ.. అందుకు అవ‌స‌ర‌మైన క‌స‌ర‌త్తుల‌ను మొద‌లెట్టింది. అందులో భాగంగానే ల‌క్ష్మ‌ణ్‌ను పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ అగ్ర నాయ‌కుడు అమిత్ షా కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కిష‌న్ రెడ్డి అసెంబ్లీకి పోటీ చేస్తే ల‌క్ష్మ‌ణ్‌ను సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌ర్గం నుంచి బ‌రిలో దింపాల‌ని బీజేపీ చూస్తున్న‌ట్లుగా స‌మాచారం. లేదంటే మ‌ల్కాజ్‌గిరి లేదా చేవెళ్ల‌లో ఏదో ఓ స్థానం నుంచి ఆయ‌న లోక్‌స‌భ‌కు పోటీ చేస్తార‌ని తెలుస్తోంది. అయితే బీజేపీలో చేరే విష‌యంపై ఇంకా ల‌క్ష్మ‌ణ్ నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల కాలేదు.

గ‌తంలోనూ షూట‌ర్ రాజ్య‌వ‌ర్థ‌న్ సింగ్ రాథోడ్‌, ష‌ట్ల‌ర్ సైనా నెహ్వాల్‌, రెజ్ల‌ర్లు యోగేశ్వ‌ర్ ద‌త్‌, బ‌బితా ఫొగాట్‌, మాజీ హాకీ ప్లేయ‌ర్ సందీప్ సింగ్‌, బాక్స‌ర్ విజేంద‌ర్ సింగ్‌, మాజీ క్రికెట‌ర్లు గౌత‌మ్ గంభీర్‌, మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్‌, న‌వ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ, మ‌హ‌మ్మ‌ద్ కైఫ్ లాంటి క్రీడాకారులు వివిధ పార్టీల్లో చేరారు. బెంగాల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆ రాష్ట్ర క్రికెట‌ర్ మ‌నోజ్ తివారి టీఎంసీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయా రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని విజ‌యం కోసం పోరాడే పార్టీలు అక్క‌డి స్థానిక క్రీడాకారుల‌కు గాలం వేయ‌డం ఆన‌వాయితీగా కొన‌సాగుతోంది. ఇలా రాజ‌కీయాల్లో చేరిన క్రీడాకారుల్లో కొంద‌రు విజయాలు సాధించ‌గా.. మ‌రికొంద‌రు ఓట‌మి పాలై క‌నుమ‌రుగైపోయారు. మ‌రి ఇప్పుడు టీఎంసీ త‌ర‌పున లియాండ‌ర్ పేస్‌, బీజేపీలో ల‌క్ష్మ‌ణ్ ఏ విధంగా త‌మ మాట‌ల‌తో ఆక‌ట్టుకుంటారో చూడాలి.