Begin typing your search above and press return to search.

మీడియా ఎదుట నిందితుల ప‌రేడ్ కు చెల్లుచీటి?

By:  Tupaki Desk   |   27 Jun 2018 5:03 AM GMT
మీడియా ఎదుట నిందితుల ప‌రేడ్ కు చెల్లుచీటి?
X
నేరం చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న వారిని నిందితులు అంటారు. నిందితులు త‌ప్పు చేశార‌న్న విష‌యాన్ని కోర్టు తేల్చిన త‌ర్వాత మాత్ర‌మే వారు దోషులు అవుతారు. అప్ప‌టివ‌ర‌కూ వారు అనుమానితులే. అయితే.. అనుమానితుల్ని.. దోషుల‌న్న‌ట్లుగా మీడియా ఎదుట హాజ‌రుప‌ర్చే వైనంపై తాజాగా న‌మోదైన పిటిష‌న్ పై హైకోర్టు ఆస‌క్తిక‌రంగా రియాక్ట్ అయ్యింది.

నేరానికి పాల్ప‌డిన‌ట్లుగా అనుమానంతో అదుపులోకి తీసుకున్న నిందితుల్ని మీడియా ఎదుట ప‌రేడ్ నిర్వ‌హించే తీరును త‌ప్పు ప‌డుతూ ఒక కంప్లైంట్ హైకోర్టు ముందుకు వ‌చ్చింది. క‌ర్నూలు జిల్లా ఆత్మ‌కూరు డీఎస్పీ మాధ‌వ‌రెడ్డి నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో.. ఒక త‌ల్లిపై అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేశారు. దీన్ని మీడియా ఎదుట స‌మావేశం నిర్వ‌హించి.. ఆమె ఫోటోలు తీసుకునేందుకు అనుమ‌తి ఇవ్వ‌టాన్ని స‌వాల్ చేశారు. ఈ వైనంపై ప్ర‌కాశం జిల్లాకు చెందిన కావ‌టి సాగ‌ర్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఏదైనా నేరారోప‌ణ ఎదుర్కొన్న‌ప్పుడు.. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారు కేవ‌లం నిందితులు.. అనుమానితులే త‌ప్పించి దోషులు కాద‌ని.. అయిన‌ప్ప‌టికీ వారిని దోషుల‌న్న‌ట్లుగా ఫోటోలు ఇవ్వ‌టం స‌రికాద‌న్న‌ది పిటిష‌నర్ వాద‌న‌. దీనిపై స్పందించిన హైకోర్టు.. జంతువుల‌కు ఇచ్చే క‌నీస గౌర‌వం కూడా సాటి మ‌నిషికి ఇవ్వ‌టం లేదే? అంటూ మండిప‌డిన కోర్టు.. పిటిష‌న్ దారు ప్ర‌స్తావించిన వైనంపై పూర్తి స‌మాచారం కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ ఇష్యూ మీద కోర్టు స్పందించే వ‌ర‌కూ పోలీసులు నిందితుల ప‌రేడ్ ను ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం లేద‌న్న మాట వినిపిస్తోంది.