Begin typing your search above and press return to search.

రెండో డోస్ ఆలస్యమైందని వదిలేయొద్దు.. ఏం చేయాలంటే?

By:  Tupaki Desk   |   25 Oct 2021 4:23 AM GMT
రెండో డోస్ ఆలస్యమైందని వదిలేయొద్దు.. ఏం చేయాలంటే?
X
మొదటి డోస్ వేసుకొని.. రెండో డోస్ వేయించుకునే విషయంలో నిర్లక్ష్యం.. అలక్ష్యం చేసిన వారు ఇప్పుడేం చేయాలి? అన్నది ప్రశ్నగా మారింది. ఇలాంటివారు పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడేం చేయాలన్న దానికి కొత్త కార్యాచరణను ప్రకటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి డోసు వేసుకొని.. రెండో డోసు వేసుకోని వారు ఏకంగా 36.55 లక్షల మంది ఉండటంతో ఇలాంటి వారికి టీకాలు వేసే ప్రత్యేక కార్యాచరణను షురూ చేశారు. మొదటిడోస్ వేసుకొని రెండో డోస్ వేసుకోని వారి విషయంలో.. రెండో టీకాను కూడా వేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాల నేపథ్యంలో.. అలాంటి వారి కోసం ఇప్పుడు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని భావిస్తున్నారు.

నిజానిక టీకా వచ్చిన మొదట్లో దాన్ని వేసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపలేదు. టీకా వేసుకుంటే సైడ్ ఎపెక్టులు వస్తాయన్న భయంతో దూరంగా ఉండిపోయారు. అయితే.. సెకండ్ వేవ్ తీవ్రతతో టీకా అవసరాన్ని గుర్తించటంతో పాటు.. ప్రమాదకరమైన కరోనాను అధిగమించే విషయంలో టీకా చేస్తున్న మేలును గుర్తించారు. దీంతో.. టీకాలకు డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే.. కేసుల తీవ్రత తగ్గిన నాటి నుంచి వ్యాక్సిన్ వేయించుకునే విషయంలో కొంత ఉదాసీనత ప్రజల్లో ఏర్పడిందన్న మాట వినిపిస్తోంది. ఇది కూడా టీకా వేసుకునే వారి సంఖ్య తగ్గటానికి కారణంగా చెబుతున్నారు.

ఇప్పటివరకు తెలంగాణలో మూడు కోట్ల మంది టీకాలు తీసుకుంటే.. అందులో 76 శాతం మంది మొదటి వ్యాక్సిన్ వేయించుకోగా.. రెండో వ్యాక్సిన్ ను కేవలం 30 శాతం మంది వేయించుకోగా.. ఇంకా 46 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంది. రెండో డోస్ ను నిర్ణీత సమయంలో వేయించుకోని కారణంగా.. రెండో వ్యాక్సిన్ వేయించుకోకుండా ఊరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం నిర్ణీత సమయంలోపు రెండో వ్యాక్సిన్ వేయించుకోని వారు..కాస్త ఆలస్యమైనా కూడా వ్యాక్సిన్ వేసుకోవటం మంచిదని సూచన చేస్తున్నారు.

అంతేకాదు.. ఆలస్యంగా టీకా వేయించుకోవటం ద్వారా మేలే జరుగుతుంది తప్పించి కీడు చేయదని ఆధారాలతో సహా స్పష్టం చేస్తున్నారు. కోవిషీల్డ్ ను నాలుగు వారాల వ్యవధిలో వేసుకుంటే దాని సామర్థ్యం 66.7 శాతంగా నమోదు అయితే.. అదే 4-8 వారాల మధ్య రెండో డోస్ వేసుకుంటే 56.42 శాతం.. 9-12 వారాల మధ్య టీకా తీసుకుంటే 70.48 శాతంగా నమోదైంది. ఇక.. 12 వారాలు (అంటే మూడు నెలల తర్వాత) అనంతరం టీకా వేసుకుంటే దాని సామర్థ్యం 77.62 శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. అంటే.. వ్యాక్సిన్ రెండో డోసు ఆలస్యంగా వేసుకోవటం వల్ల నష్టం కంటే కూడా లాభమే ఎక్కువని చెబుతున్నారు. అందుకే.. ఇంకా రెండో డోసు వేసుకోకుండా ఉన్న వారు వెంటనే వ్యాక్సిన్ వేసుకోవటం చాలా చాలా అవసరమన్నది మర్చిపోకూడదు.