Begin typing your search above and press return to search.

లక్షణ రేఖను దాటేయొద్దు.. లేనోళ్ల గురించి అన్నేసి మాటలా?

By:  Tupaki Desk   |   1 July 2021 10:04 AM IST
లక్షణ రేఖను దాటేయొద్దు.. లేనోళ్ల గురించి అన్నేసి మాటలా?
X
రాజకీయాల్లో ఎలాంటి నిబంధనలు ఉండవు. ఆ మాటకు వస్తే రూల్ అనేది ఏదైనా ఉంటే.. దాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డదిడ్డంగా వ్యవహరిస్తూ.. దాన్ని పట్టించుకోని తీరు నేతల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. ఇన్ని చేసి కూడా.. మన మధ్య లేని వ్యక్తుల గురించి.. కాలధర్మం చేసిన వారి గురించి అట్టే మాట్లాడే సంప్రదాయాన్ని మాత్రం తెలుగు రాష్ట్రాల నేతలు పాటించేవారు. తెలంగాణ రాష్ట్రంలోని కొందరు దూకుడు నేతల పుణ్యమా అని.. ఆ సంప్రదాయానికి నీళ్లు వదిలేశారు.

కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జల జగడం జరుగుతోంది. ఇలాంటివి చోటు చేసుకున్నప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి. ఎవరు తప్పు.. మరెవరు ఒప్పు అన్నది చర్చలతో తేల్చాలి. ఇదేమీ కాదనుకుంటే.. కేంద్రం ముందు పెట్టి.. వారిని మాట్లాడమని చెప్పాలి. కేంద్రం ఏం చెబితే అది చేస్తామన్న హామీని ఇవ్వాలి. అంతేకానీ.. ఎవరికి వారు తమకు తోచినట్లుగా వ్యవహరించటం సాధ్యం కాదన్న విషయాన్ని నేతలు గుర్తించాల్సిన అవసరం ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలజగడం ఎపిసోడ్ కు వస్తే.. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడుగా వ్యవహరించటమే కాదు.. అవసరానికి మించిన మసాలా మాటల్ని అనేయం.. ఆ మాటల్ని బయటకు లీక్ అయ్యేలా వ్యవహరించి వాతావరణాన్ని వేడెక్కించే ప్రయత్నం చేశారు. ఇలాంటి వాటి విషయంలో ప్రజలు అట్టే రియాక్టు కావాల్సిన అవసరం లేదు.

సీఎం కేసీఆర్ మాటల ఆధారంగా కొందరు తెలంగాణ మంత్రులు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ.. తమ హద్దుల్ని పూర్తిగా దాటేస్తున్నారు. అలాంటి తప్పులు ఇప్పటికిప్పుడు ప్రభావాన్ని చూపించకున్నా.. దీర్ఘ కాలంలో ఇవన్నీ శాపాలుగా మారతాయి. ఇవాల్టి రోజున చక్రం తిప్పొచ్చు. శాశ్వితంగా అయితే సాధ్యం కాదు కదా?

ఈ చిన్న సూక్ష్మాన్ని ఎందుకు గ్రహించటం లేదు? దివంగత మహానేతను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకునే తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్.. రేపటి రోజున తనను అలానే అంటారన్నది మర్చిపోకూడదు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. మన మధ్య లేని నేతల గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించటం చాలా ముఖ్యమన్నది మర్చిపోకూడదు.