Begin typing your search above and press return to search.

అమ్మానాన్న‌ల‌ను ప‌ట్టించుకోరా..? మీ వేత‌నంలో 30శాతం కట్..!

By:  Tupaki Desk   |   14 Feb 2021 9:30 AM IST
అమ్మానాన్న‌ల‌ను ప‌ట్టించుకోరా..? మీ వేత‌నంలో 30శాతం కట్..!
X
జ‌న్మ‌నిచ్చి, పెంచి పెద్ద‌చేసిన అమ్మానాన్న‌ల‌ను అవసాన దశలో నిర్లక్ష్యం చేయడం ఎంత దారుణం? వారి యోగ క్షేమాలు చూడకపోవడం మ‌రెంత అన్యాయం? ఈ విష‌యాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించింది మ‌హారాష్ట్రలోని జిల్లా ప‌రిష‌త్‌. అందులో ప‌నిచేస్తున్న ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది.

మహారాష్ట్రలోని లతుర్ జిల్లా పరిషత్ ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. జ‌డ్పీలో ప‌నిచేస్తున్న ఏడుగురు తమ ఉద్యోగులు.. వృద్ధులైన త‌మ‌ తల్లిదండ్రుల సంరక్షణను ప‌ట్టించుకోవ‌ట్లేదు. ఈ విష‌య‌మై జిల్లా ప‌రిష‌త్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో.. అక్క‌డ ప‌నిచేస్తున్న ఏడుగురు ఉద్యోగుల వేత‌నాల్లో 30శాతం కోత విధించారు!

లతుర్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ రాహుల్ బోండ్రే ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. మొత్తం 12మంది ఉద్యోగులు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ తమకు ఫిర్యాదులు వచ్చాయన్న బోండ్రే.. 12మంది ఎంప్లాయీస్ పేరెంట్స్ లో ఆరుగురు టీచర్లు అని తెలిపారు. దీంతో విచారించి.. మొత్తం ఏడుగురు ఉద్యోగుల జీతాల్లో కోత విధించిన‌ట్లు చెప్పారు.

కోత విధించిన ఆ డబ్బును వారి తల్లిదండ్రుల అకౌంట్లలో జ‌మ చేస్తామ‌ని బోండ్రే చెప్పారు. కాగా.. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో 30శాతం కోత విధించాలని ఇదివ‌ర‌కే ల‌తుర్ జ‌డ్పీ నిర్ణ‌యం తీసుకుంది. గ‌త సంవ‌త్స‌రం నవంబర్ లో ఈ మేర‌కు జిల్లా పరిషత్ జనరల్ బాడీ ఓ తీర్మానం చేసింది.

ఈ తీర్మానం ప్ర‌కారం.. గ‌త డిసెంబర్ నుంచే ఈ వేత‌నాల‌ కోత మొద‌లైంది. ఈ 30శాతం వేత‌నం కోత విధానం ప్రతి నెలా కొన‌సాగుతుందని తెలిపారు బోండ్రే. కాగా.. కోతల త‌ర్వాత‌, దారికి వ‌చ్చిన కొంద‌రు ఉద్యోగులు.. ఆ త‌ర్వాత నుంచి త‌ల్లిదండ్రుల‌ను బాగానే చూసుకుంటున్నార‌ట‌. దీంతో.. వారి విష‌యంలో కోతలు నిలిపేసిన‌ట్టు తెలిపారు.