Begin typing your search above and press return to search.

ఐటీ సంస్థలు వర్క్ ఫ్రం హోం కు ముగింపు పలికినట్లేనా?

By:  Tupaki Desk   |   10 Feb 2022 3:45 AM GMT
ఐటీ సంస్థలు వర్క్ ఫ్రం హోం కు ముగింపు పలికినట్లేనా?
X
గత రెండున్నరేళ్లుగా కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వడానికి మొగ్గు చూపాయి. కేవలం అత్యవసర సేవలు ఉండే కంపెనీలు తప్ప మిగతావన్నీ సాధ్యమైన మేరకు ఇంటి నుంచి పని చేయడానికి వీలు కల్పించాయి. సుమారుగా మన దేశంలో కరోనా అడుగు పెట్టిన నాటి నుంచి కూడా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ బెస్ట్ గా దానినే ఫాలో అవుతూ వచ్చాయి.

అన్నీ రంగాల మాట అలా ఉంచితే ముఖ్యంగా ఐటీ రంగంలో ఉండే ఉద్యోగులకు ఆయా కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో పాటు అందుకు తగిన సౌకర్యాలను కూడా కల్పించాయి. ఇదే దారిలో దేశీయంగా ఉన్న అనేక స్టార్టప్ కంపెనీలు, ఇతర సంస్థలు నడిచాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉండే చాలా స్టార్టప్ కంపెనీలు, ఇతర ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీస్ నుంచి పని చేయించే విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ లో ఉన్న ఐటి కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు రప్పించాలని చూస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఇటీవల తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పెట్టిన మీడియా సమావేశమే. రాష్ట్రంలో కొవిడ్ మూడవ వేవ్ ముగిసిందని ఆ సమావేశంలో ఆయన చెప్తుకొచ్చారు. అదేరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులను ఆయా కంపెనీలు తిరిగి ఆఫీసులకు పిలవాలి అనుకుంటే పిలవచ్చని ఆయన సూచించారు.

దీంతో ఇప్పటి వరకు వర్క్ ఫ్రం హోంతో పని కానిస్తున్న ఐటీ కంపెనీలు తిరిగి కంపెనీ నుంచి పని చేసే విధానానికి తెరపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికీ ఉద్యోగులను ఆఫీసులు పిలవడం రిస్క్ తో కూడు కున్నది అయినా కానీ ఇందుకు తగిన జాగ్రత్తలు కూడా ఆయా కంపెనీలు పాటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

కరోనా మహమ్మారి దేశంలో విలయ తాండవం చేసినప్పుడు అనేక కంపెనీలకు వర్క్ ఫ్రం హోం బెస్ట్ ఆప్షన్ గా కనిపించింది. దీంతో అనేక కంపెనీలు ఇందుకు తగ్గట్టుగా పని విధానాన్ని మార్చుకున్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. దేశంలో పాజిటివిటీ రేటు కూడా బాగా తగ్గింది. ఇంకా తెలంగాణలో అయితే భారీగా పడిపోయింది. దీంతో ఉద్యోగులను ఆఫీస్ నుంచి పనిచేయించడానికి కంపెనీలు ఆలోచనలు చేస్తున్నాయి.

ఇప్పటికే హైబ్రిడ్ విధానాన్ని పాటిస్తున్న చాలా కంపెనీలు ఈ ఏడాది జనవరిలో ఉద్యోగులను ఆఫీస్ కు పిలవాలని భావించాయి. కానీ అదే సమయంలో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ అడుగు పెట్టింది. దీంతో కేసుల సంఖ్య కేవలం వారం రోజుల్లోనే భారీ స్థాయిలో పెరిగాయి. వ్యాప్తి కూడా ఎక్కువ ఉండడంతో నాడు తీసుకున్న నిర్ణయాన్ని ఆయా సంస్థలు పునరాలోచించి వెనకడుగు వేశాయి. ఈ నేపథ్యంలోనే వర్క్ ఫ్రం హోం మరోమారు పొడిగించాయి. ఇలా ఆ నాడు ఆఫీసుకు పిలవాలి అని భావించిన కంపెనీలు అన్నీ కూడా నేడు ఉద్యోగులను వెనక్కి పిలిపించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.