Begin typing your search above and press return to search.

అప్పుడు మోడీ..ఇప్పుడు కేసీఆర్..డీఎంకే హ‌వానే వేర‌బ్బా!

By:  Tupaki Desk   |   12 May 2019 5:17 AM GMT
అప్పుడు మోడీ..ఇప్పుడు కేసీఆర్..డీఎంకే హ‌వానే వేర‌బ్బా!
X
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఎలాంటి రాజ‌కీయ ప్ర‌యోజ‌నం లేనిదే అడుగు ముందుకు వేయ‌టానికి కూడా ఇష్ట‌ప‌డ‌రు. ఒక దేశ ప్ర‌ధాని కుర్చీలో కూర్చున్న మోడీ లాంటి నేత‌.. ఒక ప్రాంతీయ పార్టీ.. అందునా ప్ర‌తిప‌క్ష పార్టీ అధినేత‌ను క‌ల‌వ‌టం.. అందుకోసం ఢిల్లీ నుంచి చెన్నై వ‌ర‌కూ జ‌ర్నీ చేయ‌ట‌మా? అంటే.. అది త‌మిళ‌నాడు రాజ‌కీయ‌పార్టీల‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది.

మామూలోళ్ల‌కు ఒక పట్టాన అపాయింట్ మెంట్ ఇవ్వ‌ట‌మే కాదు.. తాను ముఖ్య‌మంత్రిగా ఉన్న రాష్ట్రానికి వీవీఐపీలు లాంటి ర‌త‌న్ టాటాలాంటోళ్లు పాల్గొనే ప్రోగ్రామ్ ల‌కు వెళ్ల‌ని కేసీఆర్ లాంటి అధినేత‌.. ప్ర‌త్యేక విమానం వేసుకొని మ‌రీ త‌మిళ‌నాడుకు వెళ్ల‌టం.. ఒక విప‌క్ష అధినేత అపాయింట్ మెంట్ కోసం అదే ప‌నిగా ప్ర‌య‌త్నించ‌టం లాంటివి తమిళ తంబీల‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌ని చెప్పాలి. వీరికి ఇంత ప్రాధాన్య‌త ఎందుకు ఉంటుందంటే.. త‌మిళ ఓట‌ర్ల చ‌లువేన‌ని చెప్పాలి.

మిగిలిన రాష్ట్రాల రాజ‌కీయాల‌కు భిన్న‌మైన రాజ‌కీయం త‌మిళ‌నాడులో క‌నిపిస్తుంది. ఎన్నిక‌ల వేళ అధికార‌ప‌క్షాన్ని శిక్షించ‌టం.. విప‌క్షాన్ని నెత్తిన పెట్టుకోవ‌టం క్ర‌మం త‌ప్ప‌కుండా ఒక ప్రాసెస్ ప్ర‌కారం జ‌రుగుతుంటుంది. కొన్ని ద‌శాబ్దాల త‌ర్వాత దీన్ని బ్రేక్ చేసిన ఘ‌న‌త దివంగ‌త జ‌య‌ల‌లితే. ఆమె మ‌ర‌ణం అనంత‌రం త‌మిళ‌నాడు రాజ‌కీయం ఎలా మారిందో తెలిసిందే. బ‌ల‌మైన నేత అవ‌స‌రం త‌మిళ‌నాడుకు ఉంద‌న్న మాట స‌ర్వ‌త్రా వినిపిస్తున్న వేళ‌.. వ‌చ్చిన ఎన్నిక‌ల్లో డీఎంకే అధినేత స్టాలిన్ బ‌ల‌మైన శ‌క్తిగా అవ‌త‌రించ‌నున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

39 ఎంపీ సీట్లు ఉన్న త‌మిళ‌నాడులో గాలి ఏక‌ప‌క్షంగా వీయ‌టం ఖాయ‌మ‌ని.. అత్య‌ధిక స్థానాలు స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే సొంతం కావ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఇలాంటివేళ‌.. కేంద్రంలో హ‌వా న‌డిపించాలంటే స్టాలిన్ అవ‌స‌రం చాలా ముఖ్యం. 39 ఎంపీల్లో త‌క్కువ‌లో త‌క్కువ 32 ప్ల‌స్ స్టాలిన్ పార్టీ సొంతం కానున్న‌ట్లుగా అంచ‌నాలు వినిపిస్తున్నాయి. ఇంత భారీగా ఒకే పార్టీకి సొంతం కానున్న వేళ‌.. డీఎంకే అధినేత మ‌ద్ద‌తు సాధిస్తే.. కేంద్రంలో చ‌క్రం తిప్పేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఈ లెక్క‌ల నేప‌థ్యంలోనే అప్ప‌ట్లో ప్ర‌ధాని స్థానంలో ఉన్న మోడీ చెన్నైకి వ‌చ్చి.. డీఎంకే అధినేత క‌రుణ‌ను క‌లిసి.. ఆయ‌న ఆరోగ్యం గురించి వాక‌బు చేయ‌ట‌మే కాదు.. కావాలంటే త‌న నివాసంలో డీఎంకే పెద్దాయ‌న్ను ఉంచాల‌ని.. వైద్య సౌక‌ర్యాలు చెన్నై కంటే ఢిల్లీలో బాగా ఉంటాయ‌ని చెప్ప‌టం వెనుక అస‌లు కార‌ణం రాజ‌కీయ‌మేన‌ని చెప్పాలి. మోడీ ముచ్చ‌ట అలా ఉంటే.. ఒక‌సారి టైం లేద‌న్న స్టాలిన్ తో భేటీకి అదే ప‌నిగా ప్ర‌య‌త్నించ‌టం.. చివ‌ర‌కు చెన్నై ట్రిప్ పూర్తి చేసుకొచ్చిన త‌ర్వాత ఆయ‌న ఓకే అన‌టంతో మ‌ళ్లీ బ‌య‌లుదేర‌టం వెనుక అస‌లు కార‌ణం కూడా థ‌ర్టీప్ల‌స్ సీట్ల మ‌హిమేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఒక మోడీని.. ఒక కేసీఆర్ ను త‌మ కోసం ర‌ప్పించుకున్న ఘ‌న‌త డీఎంకే సొంతంగా చెప్పాలి. చెన్నైలో కూర్చొని ఎక్క‌డి వారైనా స‌రే.. త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చి త‌మ‌తో మాట్లాడేలా చేసుకోవ‌టంలో త‌మిళ పార్టీల‌కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికి సాధ్యం కాదేమో?