Begin typing your search above and press return to search.

ముచ్చటగా మారిన పన్నీర్.. స్టాలిన్ మర్యాద

By:  Tupaki Desk   |   28 Jan 2017 6:44 AM GMT
ముచ్చటగా మారిన పన్నీర్.. స్టాలిన్ మర్యాద
X
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. ప్రధాన ప్రతిపక్ష నేత మధ్య సంబంధాలు ఎలా ఉండాలో తెలియజేసే ఉదంతం ఒకటి మన పక్కనున్న తమిళనాడులో చోటు చేసుకుంది. సీఎం.. విపక్ష నేతల్లో ముఖ్యమంత్రిదే పైచేయి అన్నది ఎవరూ కాదనలేనిది. కానీ.. విపక్ష నేతకు సైతం మర్యాద ఇవ్వాలన్నది ఇటీవల కాలంలో తగ్గిపోతుంది. ప్రోటోకాల్ ప్రకారం.. విపక్ష నేతకు క్యాబినెట్ హోదా ఉంటుందన్నది మర్చిపోకూడదు.

కానీ.. దూకుడు రాజకీయాల పుణ్యమా అని.. పవర్ లేని వారి పట్ల వ్యవహరిస్తున్న ధోరణి ఏ మాత్రం సరిగా ఉండటం లేదు. రాష్ట్ర అభివృద్ధిలో ఈ ఇరువురు నేతలు కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. అయితే.. అందుకు భిన్నంగా ఇరువురు ఆగర్భ శత్రువల మాదిరి వ్యవహరిస్తున్న ఉదంతాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీనికి భిన్నంగా చోటు చేసుకున్న పరిణామం తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

తమిళనాడు విపక్ష నేత స్టాలిన్ శుక్రవారం ఉదయం తన ఇంటి నుంచి సచివాలయానికి బయలుదేరారు. ఆయన ప్రయాణిస్తున్న కారు మెరీనా బీచ్ లోని కామరాజర్ రోడ్డు వద్దకు చేరుకున్న వేళ.. కాస్త దూరంలో ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కాన్వాయ్ వస్తుండటాన్ని గుర్తించారు. వెంటనే.. తన కారుకు ముందు.. వెనుక ఉన్న పోలీసు వాహనాల్ని వేగం తగ్గించాలని కోరటంతో పాటు.. ముఖ్యమంత్రి కాన్వాయ్ కు ఇబ్బంది లేకుండా ఉండేలా ఓపక్కకు వాహనాల్ని నెమ్మదిగా వెళ్లాలని సూచించారు.

అదే సమయంలో.. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. దూరంగా విపక్ష నేత కాన్వాయ్ ను గుర్తించి.. తమ వాహనాల వేగాన్ని తగ్గించాలని కోరారు. సీఎం కాన్వాయ్ ఉన్నట్లుండి స్పీడ్ తగ్గి.. నెమ్మదిగా రావటం చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే తన వాహనాల్ని నిలిపివేయాలని కోరారు. స్టాలిన్ కాన్వాయ్ ను నిలిపివేసి ఉండటాన్ని గమనించిన సీఎం.. తన కాన్వాయ్ వేగాన్ని పెంచాలని చెప్పారు. ఇలా.. సీఎం.. విపక్ష నేతలు ఒకరినొకరు గౌరవించుకునే ధోరణిలో ప్రదర్శించిన పరిణితి అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు గొప్పగా మాట్లాడుకోవటం కనిపించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/