Begin typing your search above and press return to search.

200 సీట్లలో పోటీ చేయాల్సిందే: కాంగ్రెస్ సహా మిత్రులకు డీఎంకే షాక్

By:  Tupaki Desk   |   17 Sept 2020 1:20 PM IST
200 సీట్లలో పోటీ చేయాల్సిందే: కాంగ్రెస్ సహా మిత్రులకు డీఎంకే షాక్
X
డిఎంకే యువజన నేత, పార్టీ కోశాధికారి టీఆర్ బాలు చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీలో కలకలం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో 234 నియోజకవర్గాలకు గాను 200 స్థానాల్లో మనమే (డీఎంకే) పోటీ చేయాలని, ఈ మేరకు పార్టీ అధినేత స్టాలిన్ పైన ఒత్తిడి తీసుకు వస్తామని వ్యాఖ్యానించారు. తమిళనాడులో ప్రధానంగా డీఎంకే అలయెన్స్, అన్నాడీఎంకే అలయెన్స్ ఉన్నాయి. ఈ కూటమిలలో కాంగ్రెస్ సహా చిన్నా చితక పార్టీలు ఉంటాయి. వీరికి కొన్ని సీట్లు ఇస్తుంటారు. కానీ ఉదయనిధి స్టాలిన్ గతంలో కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేస్తామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. సినీ నటుడు విజయ్ కాంత్ పార్టీ ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ప్రభావం చూపలేదు.

డీఎంకే అలయెన్స్‌లో కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్, సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే, మనిథనేయ మక్కల్ కచ్చి, పెరునతలైవర్ మక్కల్ కచ్చి వంటి పలు పార్టీలు ఉన్నాయి. అన్నాడీఎంకే కూటమిలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, తమిళ్ మనీల ముస్లీం లీగ్ వంటివి ఉన్నాయి. గత ఎన్నికల్లో డీఎంకే 234 సీట్లకు గాను 176 స్థానాల్లో పోటీ చేసింది. మిగతా సీట్లలో కాంగ్రెస్‌కు41, మిగతా పార్టీలకు మిగిలిన సీట్లు ఇచ్చింది. కానీ ఈసారి 200 సీట్లలో పోటీ చేద్దామని నాయకులు అంటున్నారు.

200 సీట్లలో డీఎంకే పోటీ చేయాల్సిన అవసరం ఉందని, 2021 ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఎక్కువ స్థానాల్లో మనమే పోటీ చేయాల్సిన అవసరం ఉందని ఉదయనిధి స్టాలిన్, బాలు అన్నారు. ముఖ్యంగా గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లను ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇది శరాఘాతంగా మారింది. డీఎంకే 200 సీట్లలో పోటీ చేసే పరిస్థితి ఉంటే కాంగ్రెస్‌కు ఇచ్చే సీట్ల సంఖ్య 41 నుండి సగానికి పైగా తగ్గినా ఆశ్చర్యం లేదంటున్నారు.