Begin typing your search above and press return to search.

కన్నడ రాజకీయం: బీజేపీకి కాంగ్రెస్ పంచ్

By:  Tupaki Desk   |   3 July 2019 10:22 AM GMT
కన్నడ రాజకీయం: బీజేపీకి కాంగ్రెస్ పంచ్
X
కర్ణాటకలో అధికారంలో ఉన్న జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదంలో పడింది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్- రమేష్ జారకిహోళి ఆ పార్టీకి రాజీనామా చేయడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంపై కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుత రాజకీయాలు ఎటువైపు వెళుతున్నాయో అర్థం కావడం లేదని.. కళ్లు మూసుకొని ఎవరూ రాజకీయ చేయరని.. ఆ ఇద్దరు ఎందుకు రాజీనామా చేశారో తనకు తెలుసన్నారు. వీరిద్దరి వెనుకుండి బీజేపీ ఏం చేస్తుందో.. అందుకు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో తనకు బాగా తెలుసు అని ఆయన బాంబు పేల్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఏ పార్టీలో చేరరని ధీమా వ్యక్తం చేశారు.

రాజీనామా చేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదని.. ప్రభుత్వం కూలిపోతుందన్న వదంతులు వట్టివేనని శివకుమార్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆనంద్ సింగ్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారని చెప్పుకొచ్చాడు.

మా ఎమ్మెల్యేలను బీజేపీ లాగేస్తే.. తాము రివర్స్ ఆపరేషన్ చేపడుతామని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేష్ వ్యాఖ్యలు చేశారు. దీనికి కంటిన్యూగా మంత్రి డీకే శివకుమార్ కూడా బీజేపీ ఎమ్మెల్యేలను లాగేస్తామన్న ధోరణితో మాట్లాడడం సంచలనంగా మారింది. దీంతో కన్నడలో ప్రభుత్వం కూల్చివేత యత్నాలపై ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య జోరుగా యుద్ధం జరుగుతోంది.