Begin typing your search above and press return to search.

ఇరకాటంలో కుమారస్వామి.. !

By:  Tupaki Desk   |   1 Jun 2018 4:35 PM GMT
ఇరకాటంలో కుమారస్వామి.. !
X
కాంగ్రెస్ పుణ్యమా అని సీఎం సీటులో కూర్చున్న కుమారస్వామికి కష్టాలు మొదలయ్యాయి. మంత్రివర్గ కూర్పు ఇంకా మొదలుపెట్టకముందే కయ్యం మొదలైంది. తనను సీఎం చేయడంలో ఎంతగానో సహకరించి.. బీజేపీ వేసే గాలాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేవెవరూ పడకుండా కాపుకాసి కన్నడ సీఎం సీటు కుమారస్వామికి అప్పగించిన కాంగ్రెస్ సీనియర్ శివకుమార్ ఇప్పుడు తన డిమాండ్లు వినిపిస్తున్నారట. ఆయన తనకే మంత్రిత్వ శాఖ కావాలో కుమారస్వామికి కబురు పంపిచారట. అయితే.. అదే శాఖను తన అన్న రేవణ్న కూడా అడుగుతుండడంతో కుమారస్వామి ఎవరికి సర్ది చెప్పాలో అర్థం కాక తలపట్టుకుంటున్నట్లు టాక్.

మరోవైపు కుమార్ స్వామికి టెన్షన్ పెట్టే ప్రకటనలు చేస్తున్నారు శివకుమార్. కుమారస్వామి ప్రభుత్వ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి తననెవరూ సంప్రదించలేదని.. ఆ భేటీకి తననెవరూ పిలవలేదని ఆయన అంటున్నారు. తనది ప్రత్యేకమైన మ్యాచ్ అని, దానికి ఫలితం ప్రత్యేకంగా ఉంటుందని, అది మీరే చూస్తారని అన్నారు. అంతేకాదు... తనకు మంత్రి పదవి ఇచ్చినా ఒక్కటే, ఇవ్వకపోయినా ఒక్కటే అని కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 78 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో తాను ఒక్కడిగా ఉంటానని, తనకు ఎలాంటి సమస్య లేదని డీకే. శివకుమార్ బాంబుపేల్చారు.

సీఎం సోదరుడు రేవణ్నతో పోటీగా అదే శాఖ కావాలని శివకుమార్ పట్టుపడుతున్నట్లుగా జేడీఎస్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఆయన తనను, తనవారిని సీబీఐ టార్గెట్ చేయడంపైనా మాట్లాడారు. గురువారం సీబీఐ అధికారులు బెంగళూరు - రామనగర - కనకపుర తదితర ప్రాంతాల్లో డీకే. శివకుమార్ - డీకే. సురేష్ సోదరుల అనుచరుల నివాసాల మీద దాడులు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ అధికారులు తన తమ్ముడు డీకే. సురేష్ పేరు చెప్పాలని ఒత్తిడి చేశారని డీకే శివకుమార్ ఆరోపించారు. తన తమ్ముడు డీకే. సురేష్ ను ఎలాగైనా కేసుల్లో ఇరికించాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని, ఒక లోక్ సభ సభ్యుడి మీద ఇలా చెయ్యడం మంచిదికాదని డీకే. శివకుమార్ అన్నారు.