Begin typing your search above and press return to search.

40 ల‌క్ష‌ల మందికి మోదీకి లాభం..డీకే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   24 Dec 2019 2:30 PM GMT
40 ల‌క్ష‌ల మందికి మోదీకి లాభం..డీకే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ) కేంద్రంగా విమ‌ర్శ‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. బీజేపీని ఇర‌కాటంలో ప‌డేసేందుకు విప‌క్షాలు ఈ అంశాన్ని ప్ర‌ధానంగా ఉప‌యోగించుకుంటున్నాయి. ఢిల్లీలోని అనధికార కాలనీల్లో నివాసముంటున్న సుమారు 40 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పించినందుకు ‘మోదీకి కృతజ్ఞతలు’ పేరుతో రామ్‌ లీలా మైదానంలో భారీ బహిరంగ సభను బీజేపీ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ విశిష్ఠత’ అంటూ ప్రసంగం ప్రారంభించి సుమారు గంటన్నరపాటు మాట్లాడారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్‌ - డీకే శివ‌కుమార్ ఘాటుగా స్పందించారు. ఈ స‌భ‌లో మోదీ చేసిన కామెంట్ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌ హయాంలోనే అసోంలో ఎన్నార్సీ అంశం ముందుకు వచ్చిందని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. ‘2014లో మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు మేం ఎక్కడా ఎన్నార్సీపై చర్చించలేదు. సుప్రీంకోర్టు ఆదేశంతోనే అసోంలో అమలు చేశాం’ అని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలుపై పార్లమెంట్‌ లేదా క్యాబినెట్‌లోనూ చర్చించలేదన్నారు. ముస్లింలను నిర్బంధ కేంద్రాలకు తరలిస్తారంటూ కాంగ్రెస్‌ - దాని మిత్రపక్షాలు - అర్బన్‌ నక్సల్స్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) - ఎన్నార్సీతో భారతీయ ముస్లింలకు ఎటువంటి ముప్పులేదని మోదీ అన్నారు.‘కనీసం మీ చదువుకు విలువ ఇవ్వండి. సీఏఏలో ఏం ఉన్నదో చదువుకోండి’ అని యువతకు సూచించారు.

దీనిపై డీకే శివ‌కుమార్ స్పందిస్తూ - మోదీ త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన ప్ర‌జ‌ల‌నే అర్బ‌న్ న‌క్స‌ల్స్ అంటూ విమ‌ర్శిస్తున్నార‌ని మండిప‌డ్డారు. `మోదీ త‌ప్పుప‌డుతున్న ఈ ప్రజల మద్దతుతోనే బీజేపీ ఇటు రాష్ట్రంలోనూ - అటు కేంద్రంలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఇప్పుడు ఆ ప్రజలే రోడ్లపైకి వచ్చినప్పుడు నిందిస్తున్నారు. విద్యార్థులు, దేశంలోని మేథావులను 'అర్బన్ నక్సల్స్'తో పోల్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలి` అని డిమాండ్ చేశారు. ప్ర‌జ‌ల జీవితాల‌తో ప్ర‌భుత్వం చెల‌గాటం ఆడుతోంద‌ని విమ‌ర్శించారు.