Begin typing your search above and press return to search.

ఉప ఎన్నికల్లో మోహన్ బాబు పోటీ!

By:  Tupaki Desk   |   29 Sept 2019 12:47 PM IST
ఉప ఎన్నికల్లో మోహన్ బాబు పోటీ!
X
కర్ణాటక ఉప ఎన్నికల బరిలో సీనియర్ కాంగ్రెస్ లీడర్ మోహన్ బాబు బరిలో దిగాలని ఆ పార్టీ అధిష్టానం సూచించింది. దీంతో కెఆర్‌ పురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు కేం బ్రిడ్జ్‌ విద్యాసంస్థల అధినేత డి.కె.మోహన్‌ బాబు బరిలో దిగడం ఖరారైంది.

ఈ మేరకు పార్టీ హైకమాండ్ నుంచి తనకు ఆదేశాలు అందాయని మోహన్ బాబు ప్రకటించారు. తాను 30 సంవత్సరాలు గా కె.ఆర్‌.పురంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేశానన్నారు. ఈ సందర్భంగా ఆ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న ఇతర నేతలు - రాష్ట్ర పార్టీకి చెందిన కొందరు నేతలపై విమర్శలు చేశారు.

కాంగ్రెస్‌ నుంచి పదవులు పొందినవారు డబ్బులు కోసం ఇటీవల ప్రభుత్వాన్ని కూలగొట్టారని అటువంటి వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఇతర నియోజకవర్గాలనుంచి వచ్చి ఇక్కడ టికెట్‌ అడగడం సరికాదని ఎమ్మెల్సీ నారాయణస్వామిని ఉద్దేశించి అన్నారు. నియోజక వర్గంలోని ప్రతి గడప - ప్రతినాయకుడు తెలుసునన్నారు. కాంగ్రెస్ కు కంచుకోట అయిన నియోజకవర్గంలో కాంగ్రెస్‌ విజయం తథ్యమన్నారు.

కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ - జేడీఎస్‌ లు ప్రభుత్వం ఏర్పాటు చేసినా అనేక రాజకీయ మలుపులు తరువాత కొందరు కాంగ్రెస్ - జేడీఎస్ నేతలు బీజేపీలోకి ఫిరాయించడంతో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ స్థానంలో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమ పదవులుకు రాజీనామాలు చేయడంతో ఆయా స్థానాల్లో ఎన్నికలు అనివార్యమయ్యాయి.